వస్త్రాల తయారీ యూనిట్‌లో పురాతన విగ్రహాలు

స్వాధీనం చేసుకున్న సిఐడి అధికారులు

చెన్నై,నవంబర్‌5(జ‌నంసాక్షి): చెన్నైలోని వ్యాపారి రణవీర్‌ ఆర్‌ షాకు చెందిన వస్త్రాల తయారీ యూనిట్‌పై సీఐడీ విభాగంలోని విగ్రహాల వింగ్‌ అధికారులు దాడి చేసి, విలువైన ప్రాచీన కళాఖండాలు, ముఖ్యంగా 7 అడుగులున్న పెద్ద నంది విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి విలువైన విగ్రహం ఇక్కడ ఉండడంపై అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. గిండీ రేస్‌కోర్స్‌ యూనిట్‌లో అధికారులు ఆదివారం సోదాలు జరిపారు. 6 అడుగుల నరసింహ విగ్రహం, 5 అడుగుల గోమాత, ఏనుగు విగ్రహాలు కూడా దొరికాయి. వాటి ప్రాచీనతను పురావస్తుశాఖ సహాయంతో అంచనా వేస్తామని డీఎస్పీ సుందరం విూడియాకు చెప్పారు. రణవీర్‌ ఆర్‌ షా, కిరణ్‌రావుతోపాటుగా మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. షా, రావు డైరెక్టర్లుగా ఉన్న కేసీపీ షుగర్స్‌ అండ్‌ ఇండస్టీస్ర్‌ నుంచి 23 విగ్రహాలు స్వాధీనం చేసుకున్న తర్వాత నెలరోజులకు ఈ సోదాలు జరిగాయి. అయితే అవి ప్రాచీన విగ్రహాలు కావని, తయారీదార్ల నుంచి పొందిన పత్రాలు తమదగ్గర ఉన్నాయని షా తరఫు న్యాయవాది కే తంగరసు చెప్పారు.