వాజ్‌పేయికి విదేశీ నేతల నివాళులు

– అటల్‌తో ఉన్న సంబంధాలను నెమరవేసుకున్న నేతలు
న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు విదేశీ నేతలు తరలి వచ్చారు. బూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీకి చేరుకుని వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు. నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ కుమార్‌, గ్యావల్‌, శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్‌ కిరిల్లా, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌ సైతం ఢిల్లీ చేరుకొని వాజ్‌పేయి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వీరంతా అటల్‌ జీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ హసన్‌ మాట్లాడుతూ.. బంగ్లా విముక్తి పోరాటంలో తమ ప్రజలకు మద్దతుగా నిలిచిన విషయం మర్చిపోలేనిదని, బెంగాలీ సంగీతంతో ఆయనకున్న అనుబంధం మరువలేనిదని అన్నారు. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో దౌత్యాధికారిగా పనిచేసే భాగ్యం దక్కిందని అన్నారు. మరోవైపు మాజీ ప్రధాని వాజ్‌పేయీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. రష్యా, మాల్దీవులు, నేపాల్‌, శ్రీలంక తదితర దేశాల అధ్యక్షులు భారత రాష్ట్రపతికి సంతాప సందేశాలు పంపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి ఎంతో భాధాకరమని, ఆయన మరణానికి సంతాపంగా భారత్‌తోపాటు తమ జాతీయ జెండాను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవనతం చేసి, వాజ్‌పేయి పట్ల తమ గౌరవాన్ని చాటుకుంటామని మారిషస్‌ ప్రధాని ప్రవీద్‌ కుమార్‌ జగన్నాష్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతి విచారకరమని, ఆయన గొప్ప నాయకుడే కాదు సాహిత్యం, కళల్లో మంచి నిష్ణాతుడు అని ప్రధానిగా మాల్దీవుల్లో పర్యటించారని, ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత్‌కు మాల్దీవులు ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యవిూన్‌ అబ్దుల్‌ గయూమ్‌ తన సందేశంలో పేర్కొన్నారు.
—————————-