వాజ్‌పేయి శాంతికోసం కృషి చేశారు

– పాక్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌
– వాజ్‌పేయి మృతికి నివాళులర్పించిన ఇమ్రాన్‌
లా¬ర్‌, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణంపై పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌-పాక్‌ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. ఆసియా దేశాల్లోనే వాజ్‌పేయి ఓ గొప్ప నేత అని ఇమ్రాన్‌ ఖాన్‌ కొనియాడారు. ఆయన మరణంతో దక్షిణాసియా ఓ మహానేతను కోల్పోయిందని పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ల మధ్య రాజకీయంగా ఎన్ని సమస్యలున్నా ఆయన శాంతికోసం కృషి చేశారని, ఇదే ఆయనపై గౌరవాన్ని పెంచిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇరు దేశాల సత్సంబంధాల కోసం ఆయన పడ్డ తపన మరవలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 1999లో వాజ్‌పేయి ఢిల్లీ-లా¬ర్‌ బస్సు సర్వీస్‌ను ప్రారంభించడమే కాకుండా స్వయంగా ప్రయాణించాడు. బస్సుయాత్రలో లా¬ర్‌ వెళ్లి అక్కడ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో లా¬ర్‌ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని, అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని, ఇరుదేశాల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.
వాజ్‌పేయి మృతిపట్ల సార్క్‌ దేశాల సంతాపం..
భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి మృతిపట్ల సార్క్‌(సౌత్‌ ఏషియాన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజినల్‌ కోఆపరేషన్‌) దేశాలు సంతాపం ప్రకటించాయి. సార్క్‌ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు వాజపేయికి నివాళులర్పించాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన వాజపేయి గురువారం సాయంత్రం కన్నుమూసిన విషయం విదితమే. వాజపేయి పార్థివ దేహానికి పాకిస్థాన్‌ న్యాయ, సమాచార శాఖ మంత్రి సయ్యద్‌ జఫర్‌ అలీ నివాళులర్పించారు. ప్రత్యేక విమానంలో పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీకి జఫర్‌ అలీ చేరుకొని నివాళులర్పించారు. నేపాల్‌ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ.. వాజపేయి మృతి పట్ల సంతాప సందేశాన్ని మోదీకి పంపారు. భారతదేశానికి వాజపేయి ఎంతో సేవ చేశారని కొనియాడారు. నిబద్ధతతో ఆయన పని చేశారని పేర్కొన్నారు. భారత ప్రజలందరూ వాజపేయిని జీవితాంతం గుర్తుంచుకుంటారని ఓలీ తెలిపారు. వాజపేయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం – అమెరికా
భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణం పట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపం తెలియజేసింది. భారత్‌, అమెరికాలు చక్కని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏనాడో గుర్తించిన నేతల్లో అటల్‌ ఒకరని అమెరికా కొనియాడింది. 2000 సంవత్సరంలోనే అటల్‌ అమెరికా కాంగ్రెస్‌ ఎదుట నిలబడి అమెరికా-భారత్‌ల మధ్య ఇరు దేశాల పరస్పర కృషితో సహజమైన భాగస్వామ్యం ఏర్పడాలని అన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో వెల్లడించారు. అమెరికా, భారత్‌లు చక్కని భాగస్వామ్యం ఏర్పరుచుకుంటే అది ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికే కాకుండా ప్రపంచానికి కూడా ప్రయోజనకరం అని వాజ్‌పేయీ భావించారని, ఆయన ఆలోచనలే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు దోహదపడ్డాయని పాంపియో ప్రశంసించారు. వాజ్‌పేయీ మరణం పట్ల తాను, అమెరికా ప్రజలంతా నివాళులర్పిస్తున్నామని, గొప్ప నేత ఎడబాటుతో కుంగిపోతున్న భారత్‌కు అమెరికా ప్రజలు అండగా నిలుస్తారని, భారత ప్రజలు తమ ఆలోచనల్లో ఉంటారని, వారి కోసం ప్రార్థిస్తున్నామని పాంపియో అన్నారు. వాజ్‌పేయీ 2000 సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ ఏడాది మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ భారత పర్యటకు వచ్చారు. వీరి పర్యటనలు అప్పుడు అమెరికా-భారత్‌ల సత్సంబంధాలకు కీలకంగా మారాయి.
——————————