వాజ్‌పేయీ ఆరోగ్యం మరింత విషమం

హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు
ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడి
– చికిత్స అందిస్తున్న 15 మంది ఎయిమ్స్‌ వైద్యుల బృందం
– పరామర్శించిన ఉపరాష్ట్ర పతి వెంకయ్య, కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ,ఆగస్టు16(జ‌నం సాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం తాజాగా  విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రధాని మోడీ సహా బిజెపి అగ్రనేతలు అద్వానీ, ఆయన కుమార్తు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయ్‌ను పరామర్శించారు. ఉదయమే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎయిమ్స్‌కు వెళ్ళి వాజ్‌పేయ్‌ను పరామర్శించారు. ఎయిమ్స్‌ వద్ద వాతావరణం గంభీరంగా ఉంది. ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు కూడా సాహసించడం లేదు. మరోవైపు గ్వాలియర్‌ నుంచి వాజ్‌పేయ్‌ బంధువులు ఢిల్లీ బయలు దేరారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి చేరకుంటున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు పూజలు చేస్తున్నారు. ఎయిమ్స్‌తో పాటు, వాజ్‌పేయ్‌ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియగానే ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రాత్రి ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన్ని పరామర్శించారు. రాత్రి పొద్దుపోయాక రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, భాజపా ఎంపీ విూనాక్షి లేఖి కూడా ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శిఖర సమానుడైన అభిమాన నేత ఆరోగ్యం మెరుగుపడడం లేదని తెలిసినప్పటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆత్రుతతో ఆయన గురించి సమాచారం తెలుసుకొనే ప్రయత్నాలు చేశారు. మంత్రులు, ప్రధాని ఒకరి తర్వాత ఒకరుగా ఆసుపత్రికి వస్తుండడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. రాత్రి 7.15 గంటలకు ఆసుపత్రి వద్దకు చేరుకున్న ప్రధాని దాదాపు 50 నిమిషాలు అక్కడే ఉన్నారు. ‘దురదృష్టవశాత్తూ వాజ్‌పేయీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన క్లిష్ట పరిస్థితిల్లో ఉన్నారు’ అంటూ ఎయిమ్స్‌ నుంచి బులెటిన్‌ విడుదలయ్యాక ఆయన అభిమానులు ఇంకా కలవరపడ్డారు.
ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయీని పరామర్శించాక ఆందోళన మరింత తీవ్రం అయ్యింది.  ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, వాజ్‌పేయీ దత్త పుత్రిక నమిత, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, విజయ్‌ గోయెల్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు ఈరోజు ఎయిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయీకి చికిత్స అందిస్తోంది. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన్ని పరామర్శించ డానికి లోనికి వెళ్తున్న వారు బయటకు రాకపోవడంతో భాజపా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
వాజపేయి నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు..
మరోవైపు వాజయ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. వాజ్‌పేయి నివాసం వద్ద, పరిసర ప్రాంతాల్లో బారికేండ్లను ఏర్పాటు చేశారు. నివాస పరిసర ప్రాంతాల్లో వాహనాలు మళ్లించారు. పూర్తిగా ట్రాఫిక్‌ ఆంకక్షలు విధించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.