వాటర్ గ్రిడ్‌తో తెలంగాణకు జలహారం
హైదరాబాద్,అక్టోబర్6(జనంసాక్షి): వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి తాగునీటి పథకం ప్రపంచంలోనే మొదటిదని, వాటర్‌గ్రిడ్ పూర్తయితే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ఉన్న అనేక నీటి సరఫరా పథకాలను కలుపుకుని దీనిని ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. ఇప్పటికే సిఎం కెసిఆర్ నల్లగొండజిల్లాలో పైలాన్ ఆవిష్కరించారని, నల్లగొండ ఫ్లోరైడ్ భóూతాన్ని తరిమి కొట్టేందుకు ఇదే పెద్ద నిర్ణయమన్నారు. తాగునీరు అందించకుంటే ఓట్లు అడగమని సిఎం కెసిఆర్ చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని మరోమారు సభాముఖంగా ప్రకటించారు. విపక్షాలు ఎంతగా విమర్శించినా ఈ పథకం ముందుకు తీసుకుని వెళ్లడం ఖాయమని అన్నారు. అసెంబ్లీలో వాటర్‌గ్రిడ్‌పై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ వాటర్‌గ్రిడ్ పథకంపై విలువైన సలహాలు, సూచనలు చేసిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణాబేసిన్‌లో ఉన్న నల్లగొండ జిల్లాను సైతం ఫ్లోరైడ్ మహమ్మారి పీడిస్తోందని, దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంటింటికి తాగునీరు అందించేపథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. మంచినీటి కోసం గతంలో ఎన్నడూ ఎక్కడా ఇంతగా ప్రయత్నం జరగలేదని, గత పాలకులు ఇచ్చిన హావిూలన్ని నీటిమూటలుగా మిగిలాయన్నారు. ఇంటింటికి నీరు ఇచ్చి ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కకుండా చేస్తామని, వారి కన్నీళ్లు తుడవడమే వాటర్‌గ్రిడ్ లక్ష్యమని వివరించారు. వాటర్‌గ్రిడ్ పూర్తయితే దేశానికే ఆదర్శమవుతుందని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ప్రశంసించినట్లు ఆయన పేర్కొన్నారు. వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్లు భవిష్యత్‌కు లైఫ్‌లైన్లని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ఆడబిడ్డ మంచినీటి కోసం బిందెపట్టుకొని రోడ్డెక్కకూడదని సీఎం కేసీఆర్ సంకల్పించి వాటర్‌గ్రిడ్‌కు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ అమలుచేసిన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ది ఉన్న నాయకుడని, ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా వాటర్‌గ్రిడ్‌ను పూర్తిచేస్తామని సభకు హావిూ ఇచ్చారు. మొత్తం 1.25 లక్షల
కిలోవిూటర్ల మేర వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్లను చేపడుతున్నామని, దీనిని గతంలో వేసిన పైప్‌లైన్లకు అనుసంధానం చేస్తామన్నరు. వాటర్‌గ్రిడ్ ద్వారా వేసే పైప్‌లైన్లు భివిష్యత్‌కు లైఫ్‌లైన్లుగా పనిచేస్తయన్నారు. గ్రావిటీ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేసేందుకు రూపకల్పన చేశాం. ప్రాజెక్టు దీర్ఘకాలికంగా మనగలగాలంటే పకడ్బందీగా రూపొందించాలి. ప్రస్తుతం 106 వాటర్‌గ్రిడ్ ప్లాంట్లు ఉన్నాయని అన్నారు. వాటర్‌గ్రిడ్‌పై విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. గత పాలకులు పెద్దపెద్ద ప్రాజెక్టుల డిజైనింగ్‌ను కాంట్రాక్టర్లకే అప్పగించేవారని ఆయన పేర్కొన్నారు. జలహారంలో భాగంగా లక్షా 20వేల కిలోవిూటర్ల మేర పైపులైన్లు వేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అయితే జలహారం అనుకున్నంత సులభంగా పూర్తయ్యే పక్రియ కాదని… ఆరు శాఖల సమన్వయంతో పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పైపులైన్లు వేసేందుకు 226 చోట్ల రైల్వే క్రాసింగ్‌లను దాటాల్లసి ఉంటుందని వెల్లడించారు. 226 రైల్వే క్రాసింగ్‌లు, 540 నేషనల్ హైవేలు, 6,717 పంచాయతీరాజ్ రోడ్లు, 647 కాల్వలను దాటుకొని వాటర్‌గ్రిడ్ పైప్‌లైన నిర్మాణం జరగాలి. చాలా వరకు ప్రభుత్వ భూముల్లోంచే పైప్‌లైన్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాం. ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన నాయకులు సీఎం కేసీఆర్ తప్ప దేశంలో ఎవరైనా ఉన్నారా? గిరిజన మహిళలు కిలోవిూటర్ల మేర నడిచి మంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఇకపై ఉండదు. సీఎం కేసీఆర్ నల్లగొండ ఫ్లోరైడ్ దుఃఖాన్ని పాటగారాసి ప్రపంచానికి చాటారు. ఫ్లోరైడ్ రక్కసిని నల్లగొండ నుంచి తరిమికొడతామన్నారు. అడ్డంకులన్నింటిని అధిగమించి ప్రజలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు బాధ్యతా రాహిత్యంగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. జలహారం కోసం రూ.36 వేల కోట్లు అవసరమా? అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయని… ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ఒక్క చిత్తూరు జిల్లాకే రూ.7వేల కోట్లు మంజూరు చేశారని కేటీఆర్ తెలిపారు. అలాంటిది పది జిల్లాలున్న తెలంగాణలో రూ.36వేల కోట్లు అవసరం లేదా? అని ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటితో పాటు బ్రాడ్‌బాండ్ ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కూడా అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని కేంద్రం అన్ని రాష్టాల్రకు లేఖ రాసింది. డీపీఆర్ లేకుంటే ఏ ఫెనాన్షియల్ సంస్థ అయినా నిధులిస్తుందా? వాటర్‌గ్రిడ్ పథకానికి నిధులివ్వడం గర్వంగా ఉందని హడ్కో చెప్పింది. వాటర్‌గ్రిడ్ క్షేత్రస్థాయిలో మొదలుకాకముందే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నయి. అవినీతికి తావులేకుండా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నం. అభివృద్ధి పనులను పారదర్శకంగా నిర్వహిస్తున్నం. మైనస్ టెండర్ల ద్వారా వంద కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ వివరించారు. వాటర్‌గ్రిడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు మాటిమాటికీ అడ్డుతగులుతున్నడు. పాలమూరు, ఫ్లోరైడ్ బాధిత నల్లగొండకు నీళ్లు ఇవ్వకుండా బాబు అడ్డుపడుతున్నడు. వాటర్‌గ్రిడ్‌కు కృష్ణా జలాలు వాడుకోవద్దని ట్రిబ్యూనల్ బోర్డుకు చంద్రబాబు లేఖ రాసి అడ్డుకుంటున్నారని అన్నారు. కృష్ణా, గోదావరిలో 10శాతం నీళ్లు తాగునీటి అవసరాల కోసం వాడుకునే వెసులుబాటు ఉంది. వాటర్‌గ్రిడ్‌పై అన్ని మండలాల్లో టైమ్‌బౌండ్ మ్యాప్‌లు ఏర్పాటు చేసి పనులు చేపట్టనున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఇందులో భాగస్వామి కావాలన్నారు.