వాటికన్‌ సిటీ తరహాలో మన గుట్ట

5

– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జులై15(జనంసాక్షి): వాటికన్‌సిటీ తరహాలో యాదగిరి గుట్టను అభివృద్ధి పరచాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు.యాదగిరి గుట్టపై ఉన్న 15ఎకరాల్లో 5ఎకరాలు ప్రధాన గుడి కిందకి వస్తదని  కేసీఆర్‌ అన్నారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి 32 అవతారాల ప్రతిమలు కూడా 5ఎకరాల్లోనే రావాలి. యాదాద్రిగుట్ట విస్తీర్ణం దాదాపు 180 ఎకరాల వరకు ఉంటుంది. దీన్ని సమర్థవంతంగా వినియోగించాలి. ఈ ప్రధాన గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్‌ కూడా నిర్మించాలి. యాదాద్రిపై పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకుల నివాస గృహాలు, రథమంటపం, క్యూకాంప్లెక్స్‌, వీఐపీ గెస్ట్‌హౌజ్‌ నిర్మించాలి.దేవుడి ప్రసాదాలు తయారుచేసే వంటశాల, అద్దాల మందిరం ఇక్కడే రావాలి. యాదాద్రి కింద భాగంలో బస్టాండ్‌, కళ్యాణ మండపం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, పూజకు వినియోగించే పూలచెట్లతో కూడిన స్వామివారి ఉద్యానవనం..మండల దీక్షలు తీసుకునేవారి కోసం వసతి కేంద్రాలు నిర్మించాలి.

యాదాద్రి చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యాన వనాలు, కాలేజీలు, గెస్ట్‌హౌస్‌లు, పార్కింగ్‌ ప్లేస్‌లు ,గోశాల, అన్నదానం కోసం భోజనశాల, పర్మినెంట్‌ హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయాలి. యాదగిరిగుట్ట పరిసరాల్లో నాలుగులేన్ల రహదారులు నిర్మించాలి. యాదగిరి ప్రాంతమంతా భక్తి భావం పెంపొందేలా సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి. 1000 ఎకరాల స్థలాన్ని జోన్‌గా ఏర్పాటు చేసి లేఅవుట్‌ సిద్ధం చేయాలి.యాదాద్రి సవిూపంలోని 11 ఎకరాల్లో 3 అతిథి గృహాల నిర్మాణం చేపట్టాలి. యాదగిరిగుట్ట కింద వివాహాలకు అనుకూలంగా కల్యాణమండపాలు నిర్మాణం చేపట్టాలి. గుట్టపై ఉన్న 15 ఎకరాల్లో 5ఎకరాలు ప్రధాన ఆలయానికి చెందుతుందని తెలిపారు. 5 ఎకరాల స్థలంలో ప్రాకారం, మాఢవీధుల నిర్మాణం చేపట్టడంతోపాటు లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాల ప్రతిమలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిధులు,భూమి అందుబాటులో ఉన్నందును పనులన్నీ వారం పదిరోజుల్లోగా చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.