వాట్సప్‌తో వాయిస్ కాల్స్ – ఎలా?
వాట్సప్ – నెలకు దాదాపు 70కోట్లమంది వినియోగదారులతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందిన టెక్స్ట్, ఆడియో, విడియో, ఇమేజ్ మెసేజింగ్ యాప్. అదే ఇప్పుడు వాయిస్ కాలింగ్ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది.అయితే ఇది ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ10 యూజర్లకు మాత్రమే పరిమితం.ఐఫోన్‌లకు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వల్ల మీ వాట్సప్ కాంటాక్ట్‌లలో ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులందరితో మీరు మాట్లాడవచ్చు. మీ సిమ్, సర్విస్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా, నయాపైసా ఖర్చు లేకుండా (మొబైల్‌లో ఇంటర్‌నెట్ (3జి, వైఫై) ఉండాలి సుమా..) మాట్లాడుకోవచ్చు. కానీ ఇది జరగడం సులభం కాదు. దీనికి కొన్ని పద్ధతులున్నాయి. అవేంటంటే..
1.ముందుగా వాట్సప్ తాజా వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సప్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా వర్షన్ 2.12.14. ఒకవేళ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే అది 2.11.561 గా ఉండేట్లుగా సరిచూసుకోండి. ఇంతకంటే పాత వర్షన్లు ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్‌కు సహకరించవు.
2.ఇప్పుడు ఇంతకుముందే ఈ వాయిస్ కాలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉన్న మీ స్నేహితులను ఎవరినైనా మీకు వాట్సప్ కాల్ చేయమనండి.
3. మిస్‌డ్ కాల్ ఇస్తే కుదరదు. ఆ కాల్‌ను మీరు ఆన్సర్ చేసి, కొన్ని సెకన్లు అలాగే ఉంచితే(మాట్లాడుకోవచ్చు కూడా), అప్పుడు మీకు కూడా కాలింగ్ సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది.
4. ఎప్పుడైతే మీకు వాయిస్ కాలింగ్ యాక్టివేట్ అవుతుందో వాట్సప్ విండో కూడా అప్‌డేట్ అయ్యి, మూడు ట్యాబ్‌ల విండోగా మారిపోతుంది. ఇప్పుడు అందులో కాల్, చాట్, కాంటాక్ట్స్ టాబ్స్ అందుబాటులో ఉంటాయి.
అంతే.. మీరు నిర్విరామంగా సెల్లు బిల్లు భయం లేకుండా గంటల తరబడి మాట్లాడుతూనే ఉండొచ్చు.