వాడివేడీగా బడ్జెట్ పార్లమెంట్

3పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపటినుంచి ప్రారంభం కానున్నఈ సెషన్స్ లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతుంటే ..ఇష్యూ ఏదైనా సరే చర్చకు సై అంటోంది అధికారపక్షం. రెండు విడతలుగా ఈసారి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నారు. ఫిబ్రవరి 23నుంచి మార్చి 16 వరకూ మొదటి సెషన్,, ఏప్రిల్ 25నుంచి మే 13 వరకూ సెకండ్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్,  29న సాధారణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. గడచిన రెండు సెషన్స్ కూడా ప్రతిపక్షాల ఆందోళనలతో తుడిచిపెట్టుకుపోయాయి. లోక్ సభ, రాజ్యసభల్లో ఇప్పటికే చాలా అంశాలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఈ బడ్జెట్ సమావేశాలనైనా సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది అధికారపక్షం. దీనికి తోడు.. GST బిల్లు, రియల్ ఎస్టేట్ బిల్లులను పార్లమెంట్ గడపదాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది NDA ప్రభుత్వం. ఈ సెషన్ కు ఎలాగైనా సహకరించాలని ఇవాళ ఉదయం 11.30 గంటలకు మరోసారి ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తోంది కేంద్రం. అన్ని పార్టీల అభ్యంతరాలను లెక్కలోకి తీసుకోనున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు.. ప్రతిపక్షాలు కోరుతున్న అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఈ సమావేశాలను ఎలాగైనా సజావుగా జరపాలని డిసైడైన ఎన్డీయే సర్కారు.. నెలరోజులనుంచి ప్రతిపక్షాలతో మంతనాల సాగిస్తూ వస్తోంది.  గతనెలలోనే.. సోనియా, మన్మోహన్ లను కలిసి చర్చించారు వెంకయ్య. ఇటీవల 16వ తేదీన పార్టీల నేతలతో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. అన్ని అంశాలపై చర్చ జరిపే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ సాయంత్రం పార్లమెంటరీ పార్టీ నేతలతో… లోక్ సభా పతి సుమిత్రా మహాజన్ కూడా భేటీ కానున్నారు. లోక్ సభలో సంఖ్యాబలం లేకపోయినా పెద్దలసభలో మెజారిటీ ఉన్న కాంగ్రెస్.. ప్రధాన ఇష్యూలపై చర్చ జరగాలంటోంది. షరతులకు లోబడి.. GST, రియల్ ఎస్టేట్ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు తమకు అభ్యంతరం లేదంటోంది. ఇవాళ పార్టీ ఎంపీలతో అధినేత్రి సోనియాగాంధీ సమావేశం అవుతున్నారు. జేఎన్యూ వివాదం, హైదరాబాద్ హెచ్సీయూలో రోహిత్ ఆత్మహత్య, పఠాన్ కోట్ ఉగ్రదాడి, జీఎస్టీ బిల్లు లాంటి వివాదాస్పద అంశాలపై పార్లమెంట్ లో ఎలా క్వశ్చన్ చేయాలనేదానిపై పార్టీనేతలతో చర్చించనున్నారు సోనియా.

62 చట్టసవరణ బిల్లులు.. 12 ఆర్థిక అంశాలు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలు కూడా వాడీవేడిగా జరిగే అవకాశాల కనిపిస్తున్నాయి.