వాడ వాడలా వెలసిన బొజ్జ గణపయ్య మండపాలు
*వాడ వాడలా వెలసిన బొజ్జ గణపయ్య మండపాలు*
*•నవరాత్రుల ఉత్సవాలకు సిద్దమైన ఏర్పాట్లు పూర్తి*
*•తీరు తీరు రూపాలతో కొలువుదీరనున్న గణనాధుడు*
బయ్యారం,ఆగష్టు30(జనంసాక్షి):
దేశవ్యాప్తంగా ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే పండుగ వినాయక చతుర్థి.చిన్నా పెద్ద తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే వేడుక ఇది.నిత్యం పూజలతో,హోమాలతో, అన్నదానాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తులు నవరాత్రులు ఉత్సవాలు నిర్వహిస్తారు.నవరాత్రులు పూజలు చేసిన వినాయకుని చేతిలోని ప్రసాదంను స్వీకరించడం భక్తులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజించిన గణపయ్యను డప్పుచప్పులతో, నృత్యాలతో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు.నేడు వినాయక చవితి సందర్బంగా సర్వాంగసుందరంగా బయ్యారం మండల వ్యాప్తంగా గణనాథుడి మండపాలు సిద్ధంగా ఉన్నాయి. గల్లీ గల్లీ లో గణపయ్య నవరాత్రుల ఉత్సవాలకు భక్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆదిదేవుడు అయినటువంటి వినాయకుడి దర్శనం కోసం భక్తులు గణపయ్య మండపాలకు బారులు తీరనున్నారు.కళ్ళు మిరుమిట్లుగొలిపే రంగు రంగుల విద్యుద్దీపాలతో, తీరొక్క రూపాలతో భక్తులకు దర్శనమివ్వడానికి గణేషుడు బయలుదేరాడు.విజ్ఞాలు తొలగించే విగ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఎటువంటి ప్రమాదాలకు తావులేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.మండపాల ఏర్పాటు సమయంలో విద్యుత్ తీగలకు దూరంగా ఏర్పాటు,గణపయ్య ప్రతిమలు మండపాలకు తీసుకువచ్చే సమయంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి.జనంసాక్షి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు.