వాతావరణ మార్పులపై పోరాటం
– జర్మన్ వైస్ చాన్సెలర్ ఏంజెలా మోర్కెల్‌తో సంయుక్త మీడియా సమావేశం
– ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం
న్యూఢిల్లీ అక్టోబర్ 05 (జనంసాక్షి):
వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. జర్మనీతో కలిసి భూతాపంపై పోరాడతామన్నారు. ఉష్ణోగ్రత
(టెంపరేచర్) మారాలంటే ముందుగా మన స్వభావాన్ని (టెంపర్‌మెంట్) మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా
మోర్కెల్ బృందంతో చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు సంయుక్త విూడియా సమావేశం నిర్వహించారు. తూర్పు, పశ్చిమ జర్మనీలు కలిసిపోయి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశానికి మోదీ శుభాభినందనలు తెలిపారు. ఏంజెలా మోర్కెల్ నాయకత్వం పట్ల యూరప్ సహా ప్రపంచదేశాలన్నీ నమ్మకంతో ఉన్నాయన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో శాంతి స్థాపనకు జర్మనీ చేస్తోన్న ప్రయత్నాలను కొనియాడారు.
అనంతరం మోర్కెల్ మాట్లాడుతూ.. 1500కు పైగా జర్మన్ కంపెనీలు భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఫాస్ట్ ట్రాక్ ఒప్పందంతో మరిన్ని కంపెనీలకు మేలు చేకూరుతుందన్నారు. జర్మనీ- భారత్ ల సంబంధాలు మరింత క్రియాశీలకంగా మారాయన్న ఆమె.. శాస్త్ర, సాంకేతిక, ఉపాధి రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇకపోతే, మోర్కెల్ భారత్ కు ఓ అరుదైన బహుమానాన్ని అందించనున్నారు. గతేడాది జమ్ముకశ్మీర్ లో చోరీకి గురై జర్మనీ చేరిన పురాతన దుర్గామాత విగ్రహాన్ని తిరిగి భారత్ కు అప్పగించన్నట్లు ఆమె ప్రకటించారు. ఈ చర్య భారతీయులను సంతోషపర్చుతుందని నమ్ముతున్నట్లు మోర్కెల్ పేర్కొన్నారు. మోదీ, మోర్కెల్ లు తిరిగి బెంగళూరులోనూ సమావేశమవుతారని సమాచారం. మూడు రోజుల పర్యటన కోసం క్యాబినెట్ మంత్రులు, పలువురు వ్యాపారవేత్తలతో కలిసి జర్మన్ ఛాన్సలర్ మోర్కెల్ ఆదివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం మోర్కెల్.. బాపూఘాట్ కు వెళ్లి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్పపతి భవన్ కు చేరుకున్న ఆమెకు గౌరవ వందనం లభించింది. అక్కడ ప్రధాని మోదీ ఆమెకు స్వాగతం పలికారు. అటు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. జర్మన్ ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చలు జరిపారు.