వారణాసి అభివృద్ది దేశానికి మార్గసూచి
దేశంలో అత్యధిక నగరాలు సంప్రదాయ నగరాలు
మేయర్ల సదస్సులో వర్చువల్‌గా సందేశం ఇచ్చిన ప్రధాని మోడీ
న్యూఢల్లీి,డిసెబర్17 (జనంసాక్షి): వారణాసిలో జరుగుతున్న అభివృద్ధి యావత్తు దేశానికి మార్గసూచి కాగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత దేశంలోని అత్యధిక నగరాలు సంప్రదాయ నగరాలని చెప్పారు. ఇవి సంప్రదాయబద్ధంగా అభివృద్ధి చెందాయన్నారు. స్థానిక నైపుణ్యాలు, ఉత్పత్తులు ఏవిధంగా ఓ నగరానికి గుర్తింపుగా మారగలవో ఇటువంటి ప్రదేశాలను చూసి తెలుసుకోవచ్చునని చెప్పారు. వారణాసిలో జరిగిన అఖిల భారత మేయర్ల సమావేశంలో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. దాదాపు 120 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. నగరాల అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మేయర్లు తమ నగరం అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తు మెరుగుపడటానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని తెలిపారు. మన దేశానికి నేడు విప్లవం అక్కర్లేదని, క్రమవికాసాన్ని, పరిణామాన్ని మనం విశ్వసించాలని చెప్పారు. మన వారసత్వ కట్టడాలను కూల్చేసి, పునర్నిర్మించవలసిన అవసరం లేదని, వాటికి కొత్త శక్తిని అందించి, పునరుజ్జీవింప జేయాలని తెలిపారు. అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తమ నగరాలను అగ్ర స్థానంలో నిలిపేందుకు మేయర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పారిశుద్ద్యాన్ని వార్షిక కార్యక్రమంగా పరిగణించకూడదన్నారు. వార్డుల్లో ప్రతి నెలా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందేమో చూడాలని కోరారు. అత్యంత సుందరమైన వార్డును ఎంపిక చేయడం కోసం పోటీ పడాలని చెప్పారు. నవ పట్టణ భారతం పేరుతో ఈ మేయర్ల సదస్సు జరిగింది.వారణాసి నుంచి ప్రధాని మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన కాశీవిశ్వనాధ్ ధామ్‌ను ప్రారంభించారు. త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనుండటంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి.