వారణాసి నుంచి మోదీ ఎన్నికపై సవాల్
తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ,నవంబర్18(జనంసాక్షి): వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) నుంచి డిస్మిస్ అయిన కానిస్టేబుల్ తేజ్ బహదూర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేతత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. అంతకుముందు తేజ్ బహదూర్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. తేజ్ బహదూర్ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ఓటరు కాదని, నరేంద్ర మోదీపై ఆయన పోటీ చేయలేదని చెప్తూ, ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై తేజ్ బహదూర్ సుప్రీంకోర్టులో అపీలు చేశారు.తేజ్ బహదూర్ వారణాసి నుంచి మోదీపై పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎన్నికల కమిషన్‌కు తేజ్ బహదూర్ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ చర్య తీసుకుంది. తేజ్ బహదూర్ 2017లో విడుదల చేసిన వీడియో సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. సైనికులకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఈ వీడియోలో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.