వారికి రాజకీయ సన్యాసం ముచ్చట తీరుద్దాం
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జనవరి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్ వంద సీట్లలో గెలిస్తే తాము రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని పిచ్చిపిచ్చి వాగ్దానాలు చేస్తోన్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీల ముచ్చట తీర్చుదామని మంత్రి కెటిఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యత తీసుకుని ప్రజలు వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను వంద సీట్లలో గెలిపించాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము గెలిస్తే సన్యాసం తీసుకుంటామన్న వారి ముచ్చట తీరాలని అన్నారు. మనం వంద సీట్లలో గెలిస్తే వాళ్లు రాజకీయ సన్యాసం స్వీకరించి ఇంట్లో కూర్చుంటారని మన ప్రభుత్వం తన పనులు తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. మంత్రి కెటిఆర్ నగరంలోని గల్లిగల్లి తిరుగుతూ గడగడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు. ఈమేరకు మంగళవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నగరంలోని పలుచోట్ల రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నాగోల్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. మంత్రి రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో మనం జీరో టు హండ్రెడ్ లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. ఇంతకు ముందు జరిగిన ఏ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేయలేదని తెలిపారు. కానీ ఇప్పుడు వంద సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మనతో అందరూ కలిసి వస్తున్నారని తెలిపారు. సీమాంధ్ర సోదరసోదరీమణులు కూడా మనకు అండగా ఉన్నారని వివరించారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని వారు కూడా గ్రహించారని అన్నారు.