వారిని సస్పెండ్‌ చేయడం సబబే!

కొల్లాం: ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో కళాశాల యాజయాన్యం వారిని సస్పెండ్‌ చేసింది. అయితే దీనిపై ఆ విద్యార్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైందేనని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ ఘటన కేరళలోని కొల్లాంలో జరిగింది.

కొల్లాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న 20ఏళ్ల యువతి.. అదే కాలేజీలో చదువుతున్న యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఆ విద్యార్థులు కనిపించడంలేదంటూ వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో వారిని సస్పెండ్‌ చేశారు.

తమను అన్యాయంగా కాలేజీ నుంచి సస్పెండ్‌ చేశారని సదరు యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారించిన కేరళ హైకోర్టు.. కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టం చేసింది. ప్రేమించడం తప్పుకాదని.. పెళ్లికాకుండానే సహజీవనం చేయడం వల్ల.. కళాశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యల కింద ఈ నిర్ణయం తీసుకుందని కోర్టు వెల్లడించింది. విద్యార్థుల హక్కులను తాము వ్యతిరేకించడంలేదని పేర్కొంది. ప్రేమించినందువల్లే తమను కాలేజీ నుంచి సస్పెండ్‌ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. క్రమశిక్షణ చర్యల కిందే వారిని తొలగించినట్లు చెప్పారు. ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్‌ తమ సంస్థకు చెడ్డపేరు రావాలని కోరుకోదని వ్యాఖ్యానించారు.