వారి చిత్రపటాలు చెత్తబుట్టలో
– గాంధీభవన్‌లో కేకే, డీఎస్, బొత్స ఫోటోల తొలగింపు
హైదరాబాద్,జులై4(జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీని వీడిన నేతల ఫోటోలకు గాంధీభవన్‌లో చోటు లుకుండా చేశారు. కష్టకాలంలో పార్టీని వీడిన నేతల ఫొటోలు గాంధీభవన్‌లో ఉండటానికి వీల్లేదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.అలాంటి నేతల తీరుపై వీహెచ్ సీరియస్ అయ్యారు. గాంధీభవన్‌లోని కేకే, బొత్స ఫోటోలను ఆయన తొలగించారు. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు డీఎస్ బీఫాంలు అమ్ముకున్నారని, ఆయన టిఆర్‌ఎస్ కోవర్డు అని ఆరోపించారు. పార్టీని వీడిన నేతలను చూసి కార్యకర్తలు ఛీకొడుతున్నారు వీహెచ్ అన్నారు. దానం నాగేందర్ పార్టీలోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కెకె, డిఎస్, బొత్సలు ఉమ్మ ఆంధ్రప్రదేశ్‌కు పిసిసి చీఫ్‌లుగా పనిచేశారు. అయితే వీరు ఇప్పుడు పార్టీలో లేరు.
పార్టీ మారిన పిసిసి అధ్యక్షుల పోటోలను గాంధీభవన్ లో తొలగించారు. ఇటీవల టీఆర్‌ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్, గతంలో పార్టీ మారిన ఎంపీ కే.కేశవరావు, వైసిపిలో చేరిన బొత్స సత్యనారాయణ చిత్రాలను తొలగించారు. గాంధీ భవన్ కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు, పార్టీ సీనియర్ నేత దామోదర్ రెడ్డిలు పొటోలను తొలగించి చెత్తబుట్టలో పాడేశారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్ లో ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని విహెచ్, దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్టీకి ద్రోహం చేసినవారి ఫొటోలు గాంధీభవన్‌లో ఉండకూడదంటూ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మండిపడ్డారు. డి. శ్రీనివాస్ పార్టీని వీడతారని తాను ఊహించలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో డీఎస్ పాల్గొనలేదని, అలాంటి వ్యక్తి బంగారు తెలంగాణ కోసం ఇప్పుడు ఏం చేస్తారని విమర్శించారు. నేతలు స్వార్థంతో పార్టీని వీడుతున్నా, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే కెకె తెలంగాణ కోసం టిఆర్‌ఎస్‌లో చేరగా ఇటీవల బొత్స వైకాపాలో చేరారు. డిఎస్ మొన్ననే పార్టీకి రాజీనామా చేశారు. రేపోమాపో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు.