వారేవా : ఆవుల‌కు ఆధార్ నంబర్

దేశంలో పెరిగిపోతున్న ఆవుల అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు ప్రతి గోవుకు ఆధార్ నంబర్ తరహాలో ఒక ప్ర‌త్యేక నంబ‌రును కేటాయించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇలా చేయ‌డం ద్వారా గోవుల‌ను సంరక్షించుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఇప్ప‌టికే గోవులు వాటి సంర‌క్ష‌ణ‌పై  దేశంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆవుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు నంబ‌ర్ కేటాయించ‌డంపై మ‌రోసారి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉంటే గుజరాత్‌లో ద‌ళితులు ప్ర‌తి గోవుకు ఆధార్ త‌ర‌హాలో నంబ‌రు కేటాయించాల‌ని కోరుతున్నారు. గోవులను చంపుతున్నార‌ని కొంద‌రు గోర‌క్ష‌కులు ద‌ళితుల‌పై దాడుల‌కు దిగుతున్నార‌ని ద‌ళిత హ‌క్కుల‌ నేత నాతు ప‌ర్మార్ అన్నారు. ప్ర‌తి గోవుకు ఓ ప్ర‌త్యేక నంబ‌రు కేటాయించడంతో పాటు ఆయా గ్రామాల్లో గోశాల‌లు ఏర్పాటు చేసి వాటికి స‌రిప‌డ మేత అందివ్వాల‌ని డిమాండ్ చేశారు. గోవులు స‌రైన మేత లేక రోడ్డు ప‌క్క‌న ప‌డిఉన్న‌ ప్లాస్టిక్ బ్యాగుల‌ను తింటూ అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నాయ‌న్నారు. గోవుల‌ను చంపుతున్న సంఖ్య కంటే.. ప్లాస్టిక్ సంచులు తిని ఎక్కువ గోవులు మృత్యువాత ప‌డుతున్నాయ‌ని చెప్పారు. వీటిపై ఎవ‌రూ స్పందించ‌డంలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. అలాగే కార్పోరేట్ల‌కు ప‌చ్చిక భూముల‌ను క‌ట్ట‌బెట్ట‌డం ఆపేసి ఆయా భూముల‌ను గ్రామాల‌కు వ‌దిలేస్తే ఆవులు అక్క‌డ మేత మేస్తాయ‌ని.. అవి క‌రువ‌వ‌డంతోనే ప్లాస్టిక్ సంచుల‌ను ఆహారంగా తీసుకుని మృత్యువాత ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.

త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మే 10న పెద్ద ఎత్తున మెగా స‌మ్మేళ‌నం నిర్వ‌హిస్తున్న‌ట్లు నాతు ప‌ర్మార్ తెలిపారు.