విండీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిన రవి బిష్ణోయ్‌

నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు
కోల్‌కతా,ఫిబ్రవరి17  (జనంసాక్షి)  : అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు భారత బౌలర్‌ రవి బిష్ణోయి. తన గూగ్లీలతో వెస్టిండీస్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన రవి… 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇందులో 17 డాట్‌బాల్స్‌ ఉండటం మరో విశేషం. మొదటి మ్యాచ్‌ కాబట్టి కాస్త తడబడిన రవి బిష్ణోయి 6 వైడ్‌ బాల్స్‌ వేసినప్పటికీ… ఓవరాల్‌గా సూపర్బ్‌ అనిపించుకున్నాడు. బుధవారం జరిగిన టీ ట్వంటీలో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరంగేట్రంలోనే ఈ అవార్డు గెలిచి తన పేరిట ఓ రికార్డు నెలకొల్పాడు రవి బిష్ణోయి. అంతర్జాతీయ టీ20 డెబ్యూ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు. రవి కంటే ముందు దినేశ్‌ కార్తిక్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, అక్షర్‌ పటేల్‌, బరీందర్‌ స్రాన్‌, నవదీప్‌ సైనీ, హర్షల్‌ పటేల్‌ ఈ ఫీట్‌ నమోదు చేశారు. కాగా టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా రాజస్తాన్‌కు చెందిన రవి బిష్ణోయి నిలిచాడు. అవార్డు గెలిచిన అనంతరం రవి బిష్ణోయి మాట్లాడుతూ… ‘టీమిండియాకు ఆడాలన్న నా కల నెరవేరింది. ఎంతో సంతోషంగా ఉంది. టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్‌ బలమైన జట్టు. కాబట్టి తొలుత కాస్త కంగారుగా అనిపించింది. అయితే, నా శక్తిమేర జట్టుకు ఉపయోగపడాలని భావించాను. మంచు కారణంగా కాస్త ఇబ్బంది తలెత్తినా… బాగానే బౌలింగ్‌ చేయగలిగాను.అయితే, మొదటి మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు నిజంగా ఇది ఎంతో ప్రత్యేకం‘అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్‌తో
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1`0తో ముందంజలో నిలిచింది.

తాజావార్తలు