వింబుల్డన్ ఫైనల్స్ టికెట్ రూ. 31 లక్షలు!
లండన్: టెన్నిస్ క్రేజ్ శిఖర స్థాయికి చేరుకుంది. అదివారం సెంట్రల్ కోర్టులో జరిగే పురుషుల ఫైనల్ మ్యాచ్ చూడడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్‌కి టికెట్ ధర ఏకంగా 31 లక్షల రూపాయల వరకూ పలుకుతోందంటే క్రేజ్ ఎంత ముదిరిందో అర్థమవుతోంది. వింబుల్డన్ టోర్నమెంట్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. అయితే అందుకు కారణమూ ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఒక బ్రిటిష్ క్రీడాకారుడు ప్రతిష్ఠాత్మక గ్రాస్ కోర్టు టోర్నమెంట్‌లో ఫైనల్‌కి రావడం విశేషమే మరి. బ్రిటన్‌కి చెందిన అండీ ముర్రే నెంబర్‌వన్ అటగాడు జకోవిచ్‌తో ఫైనల్‌లో తలపడుతున్నాడు. గత ఏడాది కూడా ఫైనల్ చేరిన ముర్రే ఫెదరర్ చేతిలో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. 1936లో ఫ్రైడ్‌పెర్రీ తర్వాత ఈ గ్రాస్ కోర్టు టైటిల్ బ్రిటన్‌కి అందని మానిపండుగానే మిగిలింది. అందుకే బ్రిటిషర్లు అశలన్నీ ముర్రేపై పెట్టుకుని, ఈ సారైనా గెలవాలని కోరుతూ టిక్కెట్ ఖరీదుని లెక్కచేయకుండా సెంట్రల్‌కోర్టు దారి పట్టారు.