వికలాంగుల సంక్షేమంపై రాష్ట్రం వెనకంజ
నిజామాబాద్, నవంబర్ 3 : వికలాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఆరోపించారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వికలాంగుల సంక్షేమానికి కృషి చేయవల్సిన ప్రభుత్వం ఉన్న పథకాలను తగ్గిస్తూ, రద్దుచేయాలనే ఆలోచనలో ఉందని ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆందోళన ఫలితంగా ప్రతీనెల 500 రూపాయలు, 50వేల రూపాయల వివాహక ప్రోత్సహకాలు సాధించుకోవడం జరిగిందన్నారు. వికలాంగులకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు, రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేపడుతున్న సమయంలో 500 పింఛన్‌ను తగ్గించాలని, పింఛన్ల సంఖ్యను తగ్గించాలని మరికొన్నిటిని రద్దు చేయాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. వికలాంగులు అభివృద్ధి చెందాలంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గడిచిన ఐదుసంవత్సరాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి కొన్ని సమస్యలను సాధించుకోవడం జరిగిందన్నారు.