విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో
విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ప్రయత్నిస్తున్న ఇస్రో
చంద్రునిపై తెల్లవారుజాము కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రాణ స్థితి నుంచి మేలుకొలిపేందుకు ఇస్రో ప్రయత్నిస్తున్నది. ఒకవేళ ఇది విజయవంతమైతే ఈ ప్రయోగంలో బోనస్ లభించినట్లే. అందుకే ఈ రెండూ రీఛార్జి అవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన సంగతి తెలిసిందే. 14 రోజులు పనిచేసేలా వీటిని రూపొందించారు.చంద్రుడిపై పగటి సమయం ముగియడంతో ఈ నెల మొదటివారంలో ల్యాండర్, రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి చేర్చారు. ఆ సమయంలో అక్కడ మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి చంద్రుడిపై తెల్లవారుజాము మొదలయింది. పూర్తి సూర్యోదయానికి రెండ్రోజులు పడుతుంది. అయితే అత్యంత శీతల పరిస్థితులకు గురైన ల్యాండర్, రోవర్.. తిరిగి ఏ మేరకు రీచార్జ్ అవుతాయన్న దానిపై ఆసక్తి నెలకొన్నది.