విగ్గుల ఫ్యాక్టరీలో దోపిడీ.. 

– రూ.25 లక్షల వెంట్రుకల చోరీ
– నిందితుడు ప్రత్యర్థి కంపెనీ యజమానే అని తేల్చిన పోలీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు7(జ‌నంసాక్షి) : విగ్గులు తయారు చేసే ఓ కంపెనీలో భారీ దొంగతనం జరిగింది. రూ.25 లక్షల విలువ చేసే వెంట్రుకలను దుండగులు తుపాకీ గురిపెట్టి దోచుకెళ్లారు. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఆ దొంగతనం చేసింది ప్రత్యర్థి కంపెనీ యజమాని అని తేల్చారు. 42 ఏళ్ల అజయ్‌కుమార్‌ గత కొన్నేళ్లుగా విగ్గుల తయారీ వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతని వ్యాపారం ఈ మధ్య సరిగ్గా నడవడం లేదు. దీంతో తన ప్రత్యర్థి అయిన జహంగీర్‌ హుస్సేన్‌కు చెందిన జహంగీర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలో దొంగతనం చేయాలని పథకం రచించాడు. ఇందుకోసం తన సహాయకుడు మంగళ్‌ సేన్‌ సహకారం తీసుకున్నాడు. గత నెల 25న సేన్‌ ఆ కంపెనీలోకి కస్టమర్‌గా వెళ్లాడు. దొంగతనం చేసేందుకు రెక్కీ నిర్వహించాడు. రెండ్రోజుల అనంతరం కుమార్‌, సేన్‌, మరోవ్యక్తితో కలిసి ముసుగులు ధరించి చోరీకి వెళ్లారు. తుపాకులు, కత్తులతో బెదిరించి రూ.25 లక్షల విలువచేసే 200 కేజీల వెంట్రుకలు, రూ.30 వేల నగదు, మొబైల్‌ ఫోన్లను దోచుకెళ్లారు. ఈ దోపిడీకి సంబంధించి తన ప్రత్యర్థిపై అనుమానం ఉందని జహంగీర్‌ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. సేన్‌ ఫోన్‌ నంబర్‌పై నిఘా పెట్టారు. అతడు యూపీలో ఉన్నట్లు తెలుసుకొని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నాడు. చోరీ చేసిన వెంట్రుకలు కుమార్‌ ఇంట్లో పెట్టామని చెప్పాడు. దీంతో కుమార్‌ను అదుపులోకి తీసుకొని అతని
గోదాముల్లో దాచిన 118 కేజీల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, తమిళనాడులోని ఇతర ఆలయాల నుంచి వేలం ద్వారా తాము వెంట్రుకలను కొంటామని హుస్సేన్‌ తెలిపారు. కేజీ ధర రూ.22,000 నుంచి రూ.23,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. వాటిని ప్రాసెస్‌ చేసి రూ.28 వేలకు అమ్ముతామని.. పొడవైన జుట్టుకు ఎక్కువ ధర లభిస్తుందని హుస్సేన్‌ చెప్పారు.