విచ్చలవిడిగా బోర్ల తవ్వకంతో సమస్యలు 

జలశక్తి అభియాన్‌ చేపట్టినా కానరాని చైతన్యం
ఖమ్మం,అక్టోబర్‌4 (జనంసాక్షి):   విచ్చలవిడిగా బోర్ల తవ్వకం కారణంగా భూగర్భ జలాలు అట్టడుగుకు చేరడం వల్ల ఎండాకాలంలో సమస్యలు వస్తున్నాయి. ప్రజలు వాననీటి సంరక్షణలో ముందుకు రాకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. జలసంరోణ అభియాన్‌ కింద ప్రచారం చేస్తున్నా వాననీటి సంరోణపై పెద్దగా స్పందించడం లేదు. ప్రజల్లో చైతన్యం రానిదే ఏవిూ చేయలేమని అన్నారు. విచ్చలవిడిగా నీటి వినియోగం పెరగడంతో జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. బోర్లు వేసి భూమికి తూట్లు పొడవటంతో  గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయి. ఇష్టారాజ్యంగా బోర్లు వేయడమే కాదు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వాననీటిని భూమిలోకి పంపినప్పుడే సమస్య తీవ్రత తగ్గుతుందని అధికారులు సూచించారు. జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు,గృహ వినియోగ బోరు బావులున్నాయి. నిరంతర విద్యుత్తు సరఫరా చేయడంతో వ్యవసాయ బోర్ల సంఖ్య కూడా పెరిగింది. నీటి వినియోగం పెరగడంతోపాటు వాననీటి సంరక్షణ చర్యలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. వాల్టా చట్టం అమల్లోకి వచ్చినా  బోర్లు  తవ్వుకోడానికి అనుమతి తీసుకోవడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తే కొత్తగా తవ్వే బావులను మూసివేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ, గృహావసరాలకు సంబంధించి 2లక్షలకుపైగా గొట్టపు బావులున్నాయి. బావుల తవ్వకాలకు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్టం అటకెక్కింది. దీనిని పటిష్ఠంగా అమలు చేస్తే భూగర్భ జలాల వృథాను అరికట్టవచ్చు. అక్రమ బోరుబావుల తవ్వకాన్ని నివారించి నీటి సంరక్షణ చర్యలు తీసుకోవల్సిన అసవరం ఉంది. లేకుంటే గోదావరి పారుతున్నా నీటి ఇబ్బందులు తప్పేలా లేవు.