విజయమో వీరస్వర్గమో..

– పట్టు వదలని విక్రమార్కులు.. అన్నదాతలు

– మహాపోరు దిశగా రైతు ఉద్యమం

– టోల్‌లేకుండా ఉచిత ప్రయాణం

– 19లోపు డిమాండ్లు అంగీరించకపోతే ఆమరణ దీక్షలు చేస్తాం

– కేంద్ర సర్కారుకు అల్టిమేటం

దిల్లీ,డిసెంబరు 12 (జనంసాక్షి): కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. ఎల్లుండి సింఘు సరిహద్దులో నిరాహార దీక్ష చేయనున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 19లోపు తమ డిమాండ్లు అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని, కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టంచేశారు. రైతు సంఘాలను విడదీసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజస్థాన్‌ నుంచి రైతులు ట్రాక్టర్లతో రేపు ర్యాలీగా దిల్లీకి వస్తారని చెప్పారు. అలాగే, ర్యాలీగా వచ్చి దిల్లీ- జైపుర్‌ రోడ్డును దిగ్బంధిస్తారన్నారు. మరోవైపు, హరియాణా రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ భేటీ అయ్యారు. కొత్త సాగు చట్టాలపై పలు రైతు నేతలతో చర్చిస్తున్నారు. రైతు సాధికారత కోసమే కేంద్రం కొత్త సాగు చట్టాలను తెచ్చినట్టు ఆయన వివరించారు.

రోడ్ల దిగ్బంధానికి కదం తొక్కిన రైతులు

గత రెండు వారాలుగా హస్తిన సరిహద్దుల్లో బైఠాయించి నిరసన సాగిస్తున్న అన్నదాతలు.. నేటి నుంచి తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం దిల్లీ-జైపుర్‌, దిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని రైతు నాయకులు తెలిపారు. అంతేగాక, టోల్‌ గేట్ల వద్ద రుసుములు చెల్లించకుండా నిరసనలు చేపడతామన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అన్నదాతలు దిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టోల్‌ గేట్ల వద్ద భద్రతాసిబ్బందిని పెంచారు. అటు దిల్లీ-జైపుర్‌, దిల్లీ-ఆగ్రా రోడ్డుపై పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. రాజధాని శివారుల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతుల నిరసన నేపథ్యంలో దిల్లీలో పలు రహదారులను మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహదారులకు ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

డిసెంబరు 14న కాంగ్రెస్‌, ఆప్‌ ర్యాలీలు

అన్నదాతలకు మద్దతుగా కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ నెల 14న పంజాబ్‌లో వేర్వేరు ఆందోళనలు చేపట్టనుంది. శంభు సరిహద్దుల్లో సోమవారం భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ పంజాబ్‌ అధ్యక్షుడు సునిల్‌ జాఖర్‌ తెలిపారు. ఆమ్‌ ఆద్మీ కూడా రాష్ట్ర స్థాయి నిరసనల్లో పాల్గొననున్నట్లు వెల్లడించింది. మరోవైపు రైతులు ఉద్యమాన్ని విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ నిన్న మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆందోళనల కారణంగా సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అంతేగాక, నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చేరే ప్రమాదం ఉందని తోమర్‌ హెచ్చరించారు.