విజయవాడలో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర

న్యూఢిల్లీ: నవ్యాంధ్ర నూతన రాజధాని విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. మెట్రో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు. మెట్రో నిర్మాణాన్ని 25 కి.మీ మేర చేపట్టనున్నారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడలను కలుపుతూ మెట్రోను నిర్మించ తలపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే శ్రీధరన్ కమిటీ మెట్రో ప్రాజెక్టుపై తుది నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించిన విషయం విదితమే. ఈ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను ఢిల్లీ మెట్రో కార్పోరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. మెట్రో ప్రారంభం లాంఛనమే కావడంతో ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.