విడిది ముగిసింది.. ఢిల్లీ పిలిచింది

5

– తేనేటి విందు రాష్ట్రపతికి వీడ్కోలు సీఎం, గవర్నర్‌

హైదరాబాద్‌,జనవరి 1(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ఇవాళ్టితో ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల విడిది అనంతరం ప్రణబ్‌ముఖర్జీ గురువారం ఉదయం దిల్లీ బయలుదేరారు. హకింపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి… తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు రాష్ట్రమంత్రులు మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో వివిధ రంగాల ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ నెల 18న తన శీతాకాల విడిదికోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రణబ్‌.. విడిది ముగించుకుని గురువారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన బుధవారం సాయంత్రం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందుకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి తదితరులు హాజరయ్యారు. వివిధ రంగాల ప్రముఖులు, సైనికాధికారులతో రాష్ట్రపతి భవన్‌ సందడిగా మారింది. రాష్ట్రపతిని కలిసిన పలువురు ప్రముఖులు: ప్రణబ్‌ ముఖర్జీని పలువురు ప్రముఖులు బుధవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చి కలిశారు. ఇఫ్లూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సునయనాసింగ్‌, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి సీకే జాఫర్‌ షరీఫ్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి, టెలిగ్రాఫ్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ కేపీ నాయర్‌ తదితరులు ప్రణబ్‌ను కలిసినవారిలో ఉన్నారు. ఎమ్మార్పీఎస్‌ నేతలు వై భాస్కర్‌ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య, జేఎన్‌టీయూ విద్యార్థి వీ శశిధర్‌లు కూడా రాష్ట్రపతిని కలిశారు.కాగా 2016 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత పెరిగి సమాజంలో శాంతి నెలకొనాలని ప్రణబ్‌ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో మనిషికి, పర్యావరణానికి మధ్య బంధం ఏర్పడి దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా ఆకాంక్షించారు. ఇకపోతే ప్రజలకు తెలంగాణ సిఎం కెసిఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.