విత్తనసాగుతో లాభాలు పండిస్తున్న రైతులు

వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఉత్పత్తులు
జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): చిలుపూరు మండలం పరిధిలో పండిన విత్తనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇక్కడి విత్తనాలు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. చిలుపూరు మండలంలో సమశీతోష్ణ మండలం కావడంతో ఇక్కడి వాతావారణం విత్తనాల సేకరణ పంటల సాగుకు అనువైన ప్రాంతంగా ఉంటోంది.చిలుపూరు మండల పరిధిలో పండిన విత్తనాలు అత్యంత నాణ్యమైనవి. అందుకే వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పండిన విత్తనాలను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేస్తారు. ఈ ప్రాంతంలో పండిన విత్తనాలను కోల్డ్‌ స్టోరేజీల్లో పెట్టాల్సిన అవసరం ఉండదు.  ఇక్కడి వ్యాపారులు ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌ బీజోసీతాల్‌ కంపెనీ, జాల్నలోని కలాష్‌ కంపెనీ, సఫల్‌సీడ్‌ కంపెనీ, ఉత్తరప్రదేశ్‌లోని దృశ్య సీడ్స్‌ కంపెనీ, కోల్‌కత్తాలోని మంగల్‌ సీడ్‌ కంపెనీ, అదే విధంగా నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఇక్కడి నుంచి తరలిస్తారని రైతులు తెలిపారు. పలు కంపెనీల వారు ఇక్కడి నుంచి సేకరించిన విత్తనాలను వివిధ దేశాలకు కూడా సరఫరా చేస్తారని వివరించారు. చిలుపూరు మండల రైతులు నాలుగు దశాబ్దాలుగా విత్తనాల పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. చిక్కుడు, బబ్బెర, వంకాయ, కీరదోస, టమాట లాంటి విత్తనాల సేకరణ పంటలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిలుపూరు, వెంకటాద్రిపేట, మల్కాపూర్‌, లింగంపల్లి, కొండపూర్‌, పల్లగుట్ట, కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన రైతులతో పాటు కొమ్ముగుట్ట, వెంకటేశ్వరపల్లె ఆవాస ప్రాంతాలకు చెందిన రైతులు పంటల సాగులో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు 1972లో మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు రైతులకు విత్తనాల సేకరణ పంటల సాగును పరిచయం చేశారు. రైతుల నుంచి విత్తనాలను కొనుగోలు చేసి తీసుకువెళ్లడంతో ఈ ప్రాంతంలో విత్తన సేకరణ పంటలపై రైతులు దృష్టిని కేంద్రికరించారు. ప్రస్తుతం మల్కాపూర్‌ గ్రామం కేంద్రంగా అప్పటి రైతులు ఇప్పుడు ఈ ప్రాంతంలోని రైతులకు ఉచితంగా విత్తనాలు ఇచ్చి పంట చేతికి వచ్చాక విత్తనాలను రైతుల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత విత్తన వ్యాపార సంస్థలకు ఎగుమతి చేస్తున్నారు. మాల్కాపూర్‌ గ్రామానికి చెందిన విత్తన వ్యాపారులు ఇక్కడి గ్రామాల రైతులకే కాకుండా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ పరిధిలోని మిర్జాపూర్‌, కట్కూర్‌, అక్కన్నపేట.. ఇలా సుమారు 20గ్రామాల రైతులకు ప్రతీ యేటా విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని పీచర, వేలేరు, శాలపల్లి, జానకిపురం, కుమ్మరిగూడెం, మల్లికుదుర్ల గ్రామాలకు చెందిన రైతులు కూడా విత్తనాల సేకరణ పంటల సాగుపై దృష్టి సారించారని వివరించారు.
మల్కాపూర్‌, వెంకటాద్రిపేట, కొమ్ముగుట్ట తదితర గ్రామాల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో వంకాయతోటల సాగును రైతులు చేపట్టారు. ఒక ఎకరాకు సగటున 10క్వింటాళ్ల విత్తనాలు పండితే, క్వింటాల్‌కు సగటున రూ.18 వేలతో ఎకరాకు రైతుకు రూ.లక్షా 80వేల వరకు వస్తాయి. అన్ని ఖర్చులు తీసివేస్తే ఎకరాకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు లాభం వస్తుంది అని రైతులు వివరించారు. వంకాయపంట కంటే చిక్కుడు పంట సాగుతో మరింత లాభం ఉంటుందని  రైతులు అంటున్నారు. చిలుపూరు మండలంతో పాటు, వేలేరు, ధర్మసాగర్‌, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలాలకు చెందిన వందలాది మంది రైతులు సుమారు 300ఎకరాల్లో చిక్కుడును సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ.15 వేలు అవుతుంది. ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ.70వేల నుంచి 80వేల వరకు మిగులుతున్నాయి అని రైతులు వివరించారు. బొబ్బెర సాగుతో కూడా రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. చిలుపూరు మండల పరిధిలో సుమారు 300వందల ఎకరాల్లో బొబ్బెర పంటను సాగు చేస్తారు. ఒక ఎకరంలో బొబ్బెరను సాగు చేసి పంట చేతికి వచ్చే సరికి రూ.20వేల వరకు ఖర్చు అవుతుంది. అన్ని ఖర్చులు పోను ఎకరాకు సుమారు రూ. 50వేల వరకు లాభం ఉంటుంది. బొబ్బెర్లను ముఖ్యంగా రాయపూర్‌, గుజరాత్‌, ఢిల్లీ ప్రాంతాలకు తరలిస్తారు అని రైతులు తెలిపారు. టమాటా ఆసగులో కూడా మొత్తం ఖర్చులు పోను ఎకరాకు రూ .25వేల వరకు లాభం ఉంటుంది అని రైతులు వివరించారు.

తాజావార్తలు