విదేశాంగ విధానంపై అవగాహన లేని ట్రంప్
ఇరాన్‌తో ఎదరుదెబ్బలు తగిలినా అఫ్గన్‌పై వాచాలత
తలలు పట్టుకుంటున్న సొంత దేశనేతలు
అవసరం లేకున్న క్షమాపణలు చెబుతున్న పలువురు నేతలు
న్యూఢిల్లీ,జూలై24(జనంసాక్షి): అమెరికా అధ్యక్షులు ఎప్పుడూ ఇతర దేశాల ద్వైపాక్షిక వ్యవహారాల్లో తలదూర్చిన దాఖలాలు లేవు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరవాతనే అంతర్జాతీయంగా అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో ఎలాగో వేలు పెట్టాలని చూస్తున్నారు. ప్రధానంగా ఇరాన్ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు గల్ప్ తీరంలో పెత్తనానికి పరాకాష్టగా చూడాలి. ఇరాన్‌ను బెదరింపులతో దారికి తెచ్చుకోవాలని తెగయత్నిస్తున్నారు. దాడులతో బెరింపులకు పాల్పడుతున్నారు. అయితే అంతే ధీటుగా ఇరాన్ స్పందించడంతో తోకముడుస్తున్నాడు. నిజానికి వేరే ఏ చిన్న దేశమైనా ఇప్పటికి భయపడి పాదాక్రాంతం అయ్యేది. కానీ ఇరానీయుల సాహసాన్ని అభినందిం చాల్సిందే. అలాగే కాశ్మీర్ విషయం ఆసరాగా చేసుకుని మన దేశంపై పెత్తనం చెలాయించాలన్న భావన ట్రంప్‌లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పాక్ ప్రధానితో చర్చల సందర్భంగా కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటారు. కశ్మీర్‌పై వ్యాఖ్యలతో కలకలం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అఫ్గానిస్థాన్ విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తల్చుకుంటే అఫ్గాన్ యుద్ధంలో సులభంగా గెలవగలనని.. అయితే, కోటిమందిని చంపాలని తాను కోరుకోవడం లేదని పేర్కొన్నారు. పాక్ ప్రధాని
ఇమ్రాన్ ఖాన్‌తో సోమవారం భేటీ అయిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ సంక్షోభానికి త్వరగా తెరదించగల ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని ట్రంప్ అన్నారు. కానీ అవి కేవలం 10 రోజుల్లో భూమిపై నుంచి ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాయని వ్యాఖ్యానించారు. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకోవడం లేదని తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరతీయడంతో ఆయన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. కశ్మీర్ సమస్య భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక అంశమని మంగళవారం యూఎస్ ప్రకటించింది. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు కూర్చొని మాట్లాడుకోవడాన్ని తాము స్వాగతిస్తామని తెలిపింది. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఈ మేరకు స్పందించారు. పాక్ తమ భూభాగంలోని ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితే.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు బీజం పడుతుంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆ దిశగా పని ప్రారంభించారని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్, పాక్ కోరితే కశ్మీర్ వివాద పరిష్కార పక్రియలో సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను అమెరికాలో పలువురు చట్టసభ సభ్యులు కూడా తీవ్రంగా ఖండించారు. భారత్‌కు తమ మద్దతు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ కీలక నేత బ్రాడ్ షెర్మాన్ ఏకంగా ట్రంప్ వ్యాఖ్యలపై భారత రాయబారికి క్షమాపణలు తెలిపారు. కశ్మీర్ వివాదంలో తృతీయ పక్షం జోక్యానికి భారత్ వ్యతిరేకమని దక్షిణాసియాలో విదేశాంగ విధానం గురించి అవగాహన ఉన్నవారందరికీ తెలుసు. మోదీ మధ్యవర్తిత్వాన్ని కోరరని కూడా తెలుసు. ట్రంప్ వ్యాఖ్యలు అపరిపక్వంగా, ఆందోళనకరంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలపై భారత రాయబారి హర్ష్ శృంగ్లాకు క్షమాపణలు చెప్పా అని షెర్మాన్ తెలిపారు. విదేశీ వ్యవహారాలపై హౌస్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ఎలియట్ ఎంజెల్ కూడా భారత్‌కు మద్దతు ప్రకటించారు. కశ్మీర్ వివాదాన్ని భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని అభిప్రాయ పడ్డారు. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతినే ముప్పుందని పలువురు మాజీ దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ సరైన అవగాహన లేకుండా మాట్లాడారని అమెరికా విదేశాంగ శాఖ మాజీ దౌత్యవేత్త అలైసా ఏరెస్ పేర్కొన్నారు. ట్రంప్ సరైన సన్నద్ధత లేకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన వ్యవహారాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సరైన భాష వాడాలి. వాస్తవాలను వక్రీకరించకూడదు. కానీ అవేవిూ ట్రంప్ పాటించలేదని ఆమె వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాలకు ట్రంప్ చాలా నష్టం చేశారు. కశ్మీర్, అఫ్గానిస్థాన్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. మొత్తంగా ఇప్పుడు ట్రంప్ దేశంలోనూ తన వ్యాఖ్యల కారణంగా పలుచన అయ్యారు. ఆయనకు విదేవాంగ విధానంపై అవగాహన లేదని నిరూపించుకున్నారు.