విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సాయం
సెప్టెంబర్ 30లోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
అమరావతి,ఆగస్ట్4(జనం సాక్షి ): జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు,విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్‌ల్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు,విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగిన వాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ ఒక ప్రకటనలో తెలిపారు.