విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ కఠినవైఖరి

` నెల వ్యవధిలోనే.. 1000 మంది వీసాలు రద్దు!
` న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విద్యార్థులు
న్యూయార్క్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ విద్యార్థులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు.గడిచిన కొన్ని వారాల్లోనే 1000 మందికిపైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ట్రంప్‌ యంత్రాంగం తీరుపై అనేక మంది విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వీసా రద్దు చేసే క్రమంలో ఫెడరల్‌ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని వాదిస్తున్నారు. వీసాలను రద్దు చేస్తూ ఫెడరల్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వందలాది విదేశీ విద్యార్థులకు నిర్బంధం, డిపోర్టేషన్‌ ముప్పు పొంచి ఉంది. హార్వర్డ్‌, స్టాన్ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌, ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ సహా కొన్ని చిన్న కాలేజీల విద్యార్థులు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తంగా మార్చి చివరి వారం నుంచి ఇప్పటివరకు 160 కాలేజీల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. కనీసం 1024 మంది విద్యార్థుల వీసాలు రద్దు అయినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ అంచనా వేసింది. ఇదే సమయంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ చర్యలకు వ్యతిరేకంగా కోర్టుల్లో దావాలు వేస్తున్న విద్యార్థులు.. తమ వీసా రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద ఎటువంటి సమర్థనీయ అంశాలు లేవని వాదిస్తున్నారు. వీసా రద్దుకు అనేక కారణాలు చూపెడుతున్నప్పటికీ.. చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు కాలేజీలు పేర్కొంటున్నాయి. మరికొన్ని కేసుల్లో మాత్రం విద్యార్థులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. ‘’ఈ వీసాలను రద్దు చేస్తున్న సందర్భం, విధానం చూస్తుంటే.. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలను రద్దు చేసే విధానాన్ని డీహెచ్‌ఎస్‌ అవలంబిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది’’ అని మిషిగాన్‌ యూనివర్సిటీ తరఫున వాదిస్తున్న లాయర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యూ హ్యాంప్‌షైర్‌లోని కాలేజీ విద్యార్థులు వేసిన దావాలోనూ ఇటువంటి అంశాలనే ప్రస్తావించారు. వీటిపై మాత్రం హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. విద్యార్థి వీసా రద్దైతే.. ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధించే ప్రమాదం ఉంది. అందుకే అరెస్టుకు భయపడిన కొందరు విద్యార్థులు చదువులు పూర్తి చేయకుండానే దేశం విడిచి వెళ్తున్నట్లు సమాచారం. ఇలా వీసా రద్దు, అరెస్టు చేయడం వంటి చర్యలు.. విదేశీ విద్యార్థులను అమెరికా చదువుల పట్ల నిరుత్సాహానికి గురిచేస్తాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏయే అంశాల ఆధారంగా వీటిని రద్దు చేస్తున్నారనే దానిపై క్లారిటీ లేకపోవడం విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు, విద్యార్థుల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్న కొన్ని కాలేజీలు.. వీసాల రద్దుకు సంబంధించి ఫెడరల్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంటున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు మాత్రం విద్యార్థులకు ప్రయాణాల్లో జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నాయి. పాస్‌పోర్టులు, ఇమిగ్రేషన్‌ దస్త్రాలను తమవెంట ఉంచుకోవాలని చెబుతున్నాయి.

తాజావార్తలు