విద్యాప్రగతే అభివృద్ధికి కొలమానం
విజయనగరం, జూలై 26 : విద్యా ప్రగతే అభివృద్ధికి కొలమానమని పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పెంటపాటి మార్కండేయులు పేర్కొన్నారు. మారుతీ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కెఎల్‌పురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్స్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ నోట్స్ పుస్తకాలను విద్యార్థులకు వ్యాపారవేత్త మార్కండేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిభ గల విద్యార్థులుగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు ఉచితంగా సమకూర్చడం ద్వారా వారికి చేయూత నందించే ఈ కార్యక్రమం ఉన్నతమైనదని పేర్కొన్నారు. పట్టణంలోని మురికి వాడల్లో నివసిస్తున్న విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే సదుద్దేశంతో ఆయా పాఠశాలలకు ఫ్యాన్లు, విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పాదరక్షలు సమకూర్చడం జరుగుతోందన్నారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు కెఎల్ పురం ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి స్టీలు కంచాలను రెండు రోజుల్లో సమకూరుస్తామన్నారు. మారుతీ స్వయం సంఘం అధ్యక్షుడు గుత్తూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా పట్టణంలోని పలువురు వ్యాపారవేత్తల సహకారంతో నోట్స్ పుస్తకాలను పంపిణీ నిరాఘాటంగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సత్యారావు, పాఠశాల ఉపాధ్యాయులు స్థానికులు పాల్గొన్నారు.