విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు
ఖమ్మం, జూలై 23: విద్యాప్రమాణాలు పెంచేందుకు కలెక్టర్ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడిన వసతులు కల్పించడంతో పాటు భవనాలు ఉండేలా చూస్తామని చెప్పారు. 95 శాతం వరకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయిందని, త్వరలో దుస్తులు కూడా సరఫరా చేస్తామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయినందున కొరత ఉన్న చోట వలంటీర్ల నియామకాలు చేస్తున్నామని, దీనికి సంబంధిత ఎంఇఓలకు నియామకపు బాధ్యతలు అప్పగించామని డిఇఓ వెంకట్‌రెడ్డి తెలిపారు. విద్యార్థుల సామర్ధ్యాన్ని తెలుసుకొని, వెనకబడిన వారిపై దృష్టి పెట్టేందుకు బేసిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, జూలై చివరి వారం నుంచి ఈ పద్ధతి అమలు చేస్తామన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో వసతుల కల్పన, ఫీజుల వివరాలపై ఆరా తీస్తున్నామని, నిబంధనల ప్రకారం లేనివాటిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.