విద్యారంగంలో విప్లవం రావాలి 

తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక ప్రకటించినా ఎందుకనో అది పట్టాలకెక్కడం లేదు. నిజానికి కులమతాలకు అతీతంగా విద్యను అందిస్తానని సిఎం కెసిఆర్‌ పలుమార్లు ప్రకటించారు. సామాన్యుడి నుంచి, రాజకయీఆనాయకుల, అధికారుల పిల్లలంతా ఒకే విద్యావిధానంలో చదవాలన్న ఆకాంక్షను ప్రకటించారు. కులరహిత హాస్టళ్లు ఉండకూడదని కూడా చెప్పారు. ఇంతటి ఉదాత్తమైన పథకం ఎందుకనో ముందుకు సాగడం లేదు. నిజానికి ఇప్పటి వరకు సిఎం కెసిఆర్‌ చేస్తున్న పథకాలు ఒక ఎత్తయితే ఈ పథకం ఒక ఎత్తయ్యేది. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది. కామన్‌ ఎడ్యుకేషన్‌ అన్నది సమాజాంలో అంతరాలను తొలగిస్తుంది.  అది ఎల్‌కెజి నుంచే పిల్లల్లో భేదభావాలు లేకుండా చేస్తుంది. ఇప్పుడున్న స్కూళ్లను చూస్తుంటే ఆర్థికస్థాయిని బట్టి నడుపుతున్నారు. అయితే ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉండగానే గురుకులాలు, ఉర్దూవిూడియం స్కూళ్లు ప్రారంభించడం, అనేక హాస్టళ్లను కొత్తగా చేప్టటడం వల్ల  పథకం అటకెక్కిందన్న భావన కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నాయి. తెలంగాణలో గతంతో పోలిస్తే విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గురుకులాల ఏర్పాటు వల్ల్‌ సామాన్యుకలు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి వచ్చింది. దానిని కాదనలేం. అలాగే క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం గ్రావిూణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లను వర్తింప చేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుందని విద్యారంగ నిపుణులు సైతం అభినందిస్తున్నారు. ఇది ఓ రకంగా  క్రీడాకారులకు ఎంతో మేలు చేసే నిర్ణయమిది. దీంతో తమకు ఉద్యోగాలు దక్కగలవన్న భరోసా వారిలో ఏర్పడింది. ఇప్పటికే అనేక మంది క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తునన తీరు గతంలో ఎప్పుడూ జరగలేదు. తమ ప్రతిభ ద్వారా దేశానికి, రాష్ట్రాలకి  కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల బాధ్యత. ర్యాంక్‌లు, మార్కులకోసం పోటీపడే ప్రస్తుత కాలంలో ఆటలు ఆడితే పిల్లలు పాడవుతారని, చదువుల్లో వెనకబడతారనే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు క్రీడా సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. గ్రామస్థాయిలో సరైన సదుపాయాలు లేకపోవడం, క్రీడలను ప్రోల్సహించేలా పరికాలు, క్రీడా సామాగ్రి లేకపోవడం, ఆడుకోవడానికి మైదానాలు లేకపోవడం వంటి కారణాలూ ఉన్నాయి. విద్యా సంస్థలు సైతం వీటిని ప్రోత్సహించడం లేదు. హైదరాబాద, తదితర పట్టణాల్లో కార్పోరేట్‌ స్కూల్‌ కల్చర్‌ వచ్చాక క్రీడలను పూర్తిగా విస్మరించారు. కేవలం ఇరుకుగదుల్లో పిల్లలను బందీలను చేశారు. పుస్తకాలను బట్టీ పట్టించడం తప్ప మరోటి వారికి తెలియకుండా చేస్తున్నారు. క్రీడా పోటీలలో పాల్గొన్న విద్యార్థులు ఏక కాలంలో చదువులపై, ఆటలపై దృష్టి సారించలేరు. అటువంటి విద్యార్థులకు ఉన్నత చదువులలో రిజర్వేషన్‌ సౌకర్యం ఉండాలి. ఉద్యోగాలలో రిజర్వేషన్ల వల్ల క్రీడాకారులకు భవిష్యత్‌ ఉపాధికి హావిూ ఉంటే క్రీడల్లో తమ పిల్లల్ని ప్రోత్స హించే తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. క్రీడలకు సరైన ప్రోత్సహకాలు లేక ఎంతోమంది భావి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలవలే మిగిలిపోయారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు కూడా దినసరి కూలీలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల్లో దాదాపు 29 క్రీడాంశాలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ రిజర్వేషన్‌
సౌకర్యం వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం వల్ల్‌ తెలంగాణలో మార్పు కనిపిస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత పలు సందర్భాల్లో క్రీడారంగ రిజర్వేషన్లపై అనేక విజ్ఞప్తులు వచ్చాయి. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హావిూ మేరకు క్రీడా రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించడం ద్వారా వారిలో ప్రోత్సాహాన్ని నింపారు. దొంగ సర్టిఫికెట్లకు అవకాశం లేకుండా నిజమైన క్రీడాకారులకు రిజర్వేషన్ల ఫలాలు దక్కేలా అన్ని శాఖలు సమిష్టి కృషి చెయ్యాలి. ఈ ఫలితాలు పొందిన క్రీడాకారులు భావి క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఇలా అన్ని రంగాల్లో విద్యార్థులు విజయాలు సాధించేలా మన విద్యారంగాన్ని తీర్చిదిద్దుకోవాలి. విద్యారంగానికి ప్రభుత్వం కూడా అధిక బడ్జెట్‌ కేటాయింపులు చేసి వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల విద్యాలయాలు 815 అయ్యాయి. ఒక్కొక్క విద్యార్థిపై ఏటా ఒక లక్ష రూపాయలు వెచ్చిస్తున్నారు. పేదపిల్లలకు కార్పోరేట్‌ విద్యాసంస్థలను తలదన్నే విధంగా చదువు, సౌలభ్యాలు, మౌలిక వసతులు లభిస్తున్నాయి. దాని వల్లనే తొలి సారిగా కార్పోరేట్‌ విద్యాసంస్థల పాతర్యాంకుల చరిత్రను తలకిందులు చేస్తూ ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు అగ్రస్థానం సాధిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ద్వారా చేస్తున్న నిశ్శబ్ద విప్లవం. చదువుకుంటే నిరుద్యోగిగా మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉపాధికి తగ్గ చదువు దక్కేలా చేయాలి. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను, కరికులమ్‌ను మార్చాలి.  పాఠశాల స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భవిష్యత్తులో సామాజిక మార్పుకు దోహదపడుతుందని రుజువు చేయాలి.
————-