విద్యార్థి ఉద్యమంలా హరితహారం సాగాలి
ఆదిలాబాద్,జూలై25(జనంసాక్షి): ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా 2002లో ఆవిర్భవించి నిత్య చైతన్యంతో విద్యార్ధి లోకాన్ని ఒక్కటిగా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌వీదేనని బోథ్ ఎమ్మెల్యే బాపురావు అన్నారు. టీఆర్‌ఎస్‌వీలో విద్యార్థులు సభ్యత్వం తీసుకొని ముఖ్యమంత్రి కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో వీరు భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా సిఎం కెసిఆర్ చేపట్టిన హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు.చెట్లతోనే పర్యావరణం సమతుల్యతతో పాటు జీవకోటి మనుగడ సాధ్యమని రాథోడ్ బాపురావ్ అన్నారు. ప్రతి విద్యార్ధి వారివారి ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలని పిలుపునిచ్చారు. మండలంలో ఇప్పటి వరకు నాటిన మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.