విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

లక్ష్యం మేరకు చదువు కోవాలన్న ఎమ్మెల్యే
కాకినాడ,జూలై22(జ‌నంసాక్షి): విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా చదవువుకోవాలని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు పేర్కొన్నారు.  ఉపాధ్యాయుల సూచనలకు అనుగుణంగా కష్టపడితే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. సోమవారం బి.సావరం గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి చదివిన బాలికలకు రాజన్న బడి బాట సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ… ప్రతి పేదింటి బిడ్డను విద్యావంతులుగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు. ఈ పథకంలో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి ఖర్చు లేకుండా చేయడానికి రూ.15 వేలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం సమకూర్చిన సదుపాయాలను ఉపయోగించుకొని బాల బాలికలు మంచి ఫలితాలు సాధించాలని రాపాక వరప్రసాదరావు ఆశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి జొన్నలగడ్డ గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్‌ కుంపట్ల మంజు లతా చిన్నారి, మాజీ ఎంపిటిసి సభ్యులు కంచి నాగమణి, విద్యా కమిటీ చైర్మన్‌ చెల్లుబోయిన శరన్‌ జోస్నా, కంచి వెంకట రమణ, కూనపరెడ్డి రాంబాబు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.