విద్యార్థులు తిరగబడితే మోదీ పీఠం బీటలు వారతుంది

4

– ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూదిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):విద్యార్థిలోకం తిరగబడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఠం షేక్‌ అవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ విశ్వవిద్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గత ఐదు రోజులుగా విద్యార్థులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆయన రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై విద్యార్థులతో మాట్లాడుతూ… రోహిత్‌ అమర్‌ రహే…జై భీం నినాదంతో ప్రసంగించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖలోని అంశాలు అవమానకరమన్నారు. యూనివర్సిటీలో ఉగ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తులు ఉన్నారని దత్తాత్రేయ లేఖలో రాయడం సిగ్గుచేటని, ఇలాంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టమన్నారు.  మొత్తం వివాదానికి కారణం ఏబీవీసీ విద్యార్థి నేత సుశీల్‌ కుమార్‌పై దాడి అని… ఆయన గాయాలతో ఆస్పత్రిలో చేరలేదని… అయినా దీనిపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రకటన చేయడం సిగ్గుచేటన్నారు. జరిగిన ఘటనను పక్కదారి పట్టించేందుకు యత్నించారని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆమె చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని మండిపడ్డారు. దేశం యావత్తూ విద్యార్థుల వెంట ఉందని ఆయన అన్నారు.  బీజేపీకి ఏ సిద్ధాంతం లేదని, వారు హిందువులకు కూడా చేసిందేవిూలేదని కేజ్రీవాల్‌ విమర్శించారు. వారు ఏ వర్గానికి ఎలాంటి మేలు చేయలేదని ఆయన మండిపడ్డారు. వర్సిటీ వీసీ అప్పారావుపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయని, ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో స్మృతీ ఇరానీ పేరు కూడా చేర్చాలని, ఇద్దరు మంత్రులను కేంద్ర కేబినెట్‌ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.