విద్యార్థులు సహకరిస్తే తరగతులు నిర్వహిస్తాం
– హెసీయూ వీసీ వెల్లడి
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): విద్యార్థులు సహకరిస్తే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో శుక్రవారం తరగతులు యథాతథంగా జరుగుతాయని తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. తరగతుల నిర్వహణకు సహకరిస్తామని విద్యార్థులు చెప్పారని ఆయన వెల్లడించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన దిగడంతో హెచ్ సీయూలో తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగింది. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే అత్యవసర క్లాసులు, ల్యాబ్ ల నిర్వహణకు హెచ్ సీయూ స్టూడెంట్ జేఏసీ గురువారం అంగీకరించింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు క్లాసుల బహిష్కరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇదిలావుంటే విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో విచారణ చేపడతామని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ) తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వేముల రోహిత్ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం తమ పరిధిలో లేదని చెప్పారు. ఇప్పటికే రోహిత్ కుటుంబానికి రూ. 8 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించామని వెల్లడించారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టును కోరామన్నారు.
2008లో విద్యార్థి సెంథిల్ కుమార్ ఆత్మహత్యకు తాను బాధ్యున్ని కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై సీఐడీ విచారణ కూడా జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టకుని విద్యార్థులు ఆందోళన విరమించాలని ఆయన కోరారు. ఆందోళనల కారణంగా స్కాలర్ షిప్ లు, ఫెలో షిప్ లు, క్లాస్ 4 ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాగా రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.