విద్యార్థుల అరెస్టుకు నిరసనగా..

నిజామాబాద్‌, జూలై 18: విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా సెక్రటేరియట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘం నాయకులు దగ్దం చేశారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడాలన్న లక్ష్యంతో విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జీలు, అరెస్టులను చేయిస్తుందని ఆరోపించారు. సెక్రటేరియట్‌లో వంద మందికి పైగా, ఖమ్మంలో 20 మందికి పైగా విద్యార్థి నాయకులను అరెస్టు చేసి కేసులను నమోదు చేసిందని వారు పేర్కొన్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందించాలని వారు డిమాండ్‌ చేశారు. స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించి వీటిని ఎత్తివేసే ఆలోచనను మానుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాహక్కు చట్టంతో ఫీజు నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని వారు కోరారు. అప్పుడే ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులు వసూళ్లు తగ్గుతాయని వారు తెలిపారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్‌, జబ్బర్‌, పిడిఎస్‌యు నాయకులు సరిత, అన్వేష్‌, వరదరాజు, రవికుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాజుగౌడ్‌, జ్వాలారాణి, వినయ్‌, గోపి, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

తాజావార్తలు