విద్యార్థుల రాస్తారోకో, ధర్నా
నిజామాబాద్, నవంబర్ 9 (): వసతి గృహాలకు సబ్సిడీపై గ్యాస్‌ను అందించాలని కోరుతూ శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ ఎదుట పిడిఎస్‌యు విద్యార్థులు రాస్తారోకో , ధర్నా నిర్వహించారు. సబ్సీడీపై వసతి గృహాలకు గ్యాస్‌ని అందించాలని, సీఎం డౌన్‌డౌన్ అని నినాదాలు చేశారు. పోలీసులు కలుగజేసుకు ధర్నా విరమించాలని కోరినా విద్యార్థులు వినిపించుకోలేదు. అరగంట పాటు చూసి ట్రాఫిక్ సిఐ పిడిఎస్‌యు విద్యార్థులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు సమాయత్తం అవ్వగా, విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఎంతకీ రోడ్డుపై నుంచి కదలకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు డిఎస్‌పికి ఫోన్ చేశారు. దీంతో డిఎస్‌పి రామ్‌మోహన్ సర్ది చెప్పినా వినలేదు. డిఎస్‌పి ఆదేశంతో ముందు విద్యార్థులను రోడ్డుపై నుంచి లాగి జీపులోకి ఎక్కించగా విద్యార్థినులు అడ్డుకున్నారు. దీంతో మరికొంత విద్యార్థినులు అక్కడ ధర్నాకి దిగారు. మహిళ పోలీసులను డిఎస్‌పి పిలిపించి , విద్యార్థినిలను లాగేందుకు తీవ్రంగా యత్నించారు. విద్యార్థినిలు ప్రతిఘటించడంతో ఒకొక్క విద్యార్థిని లాగి జీపులోకి ఎక్కించారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు నాయకురాలు ప్రగతి మాట్లాడుతూ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచుతున్న ముఖ్యమంత్రి, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెస్ చార్జీలు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సబ్సీడీ మీద 9 సిలెండర్లు ఇవ్వాల్సి ఉండగా , ఆరు సిలిండర్లనే ఇస్తామని చెబుతున్నారని అన్నారు. స్కాలర్‌షిప్స్ అందించి మెస్ చార్జీలను తొమ్మిది వందలకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు సుధాకర్, ప్రదీప్‌లు ఉన్నారు.