విద్యావేత్త సీతారామస్వామి కన్నుమూత
శ్రీకాకుళం, జూలై 29 : పట్టణానికి చెందిన విద్యావేత్త రౌతు సీతారామస్వామి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం పెదమెరడంగికి చెందిన సీతారామస్వామి శ్రీకాకుళంలోనే స్థిరపడ్డారు. 1936లో జన్మించిన ఆయన చిన్నతనంలోనే వామపక్ష ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యారు. 1961లో డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టు నుంచి బర్తరఫ్‌కు గురయ్యారు. 1963లో గ్రూప్ -1 సర్వీసుకు ఎంపిక కాగా వామపక్షాల ఉద్యమంలో ఉండడంతో ఆయన ఎంపికను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం హైకోర్టులో పోరాడి 1969లో పిజి ఉపాధ్యాయునిగా విధుల్లోకి చేరారు. తరువాత జూనియర్ లెక్చరర్‌గాను, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించారు. తిరుపతి, విశాఖపట్నంలో ఇంటర్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. 1994లో పదవీ విరమణ చేసి అనంతరం స్థానికంగా శాంతినికేతన్ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. 2000లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో ప్రస్తుత 24వ వార్డు నుంచి కౌన్సిలర్‌గాను, 2006-07లో శాసనమండలి స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2001 నుంచి సుమారు పదేళ్ల పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగాను, డిసిసి కార్యాలయ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. 2005లో ప్రభుత్వం ఆయనను ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా నియమించింది. ప్రస్తుతం జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షునిగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కొనసాగుతున్నారు. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.