విద్యావ్యవస్థను ప్రక్షాళన చేద్దాం
– సమగ్రంగా చర్చిద్దాం రండి
– విపక్షాలకు సీఎం కేసీఆర్ పిలుపు
– ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం
– డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్,మార్చి21(జనంసాక్షి): విద్య విషయంలో సమగ్ర చర్చ జరగాలని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గుర్తింపులేని పాఠశాలలను రద్దు చేస్తే కొంతమంది విద్యార్థులు నష్టపోతారు, అందరం చర్చించి విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుందని, మోడల్ పాఠశాలల చట్టం తీసుకొచ్చిందని వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా సమగ్ర చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.మార్చి, ఏప్రిల్ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విద్య అంశంపై చర్చ జరిగింది.సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… విద్యా హక్కు చట్టం అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40వేల మంది టీచర్లకు పనిలేకుండా పోతుందనిఅన్నారు. అసెంబ్లీలో ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల బాదుడుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. యూపీఏ సర్కార్ హయాంలో మోడల్ స్కూల్ ప్రతిపాధన వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా విద్యాశాఖలో సంస్కరణలు తెస్తోందని అన్నారు. ప్రైమరీ నుంచి యూనివర్సిటీ విద్యవరకూ విద్యారంగంపై అన్ని స్థాయిల్లో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కాగా.. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు విద్యార్థులు సైతం చీటికి మాటికి వీధుల్లోకి రావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.విద్యా విధానాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి యూనివర్సిటీ విద్య వరకు సభలో చర్చ జరగాలన్నారు. అందరం చర్చించి విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుందామని సూచించారు. విద్యా విధానానికి సంబంధించి కేంద్రం నుంచి పలు దఫాలుగా మార్పులు వస్తున్నాయని తెలిపారు. కేజీ టు పీజీ విద్యా విధానం అమలుకు కూడా సమస్యలు వస్తున్నాయన్నారు. సమస్యలను అధిగమించేందుకు పలు రకాలుగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. త్వరలోనే విద్యా విధానంపై చర్చ చేపట్టి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ నిర్వహిస్తున్న గురుకుల పాఠశాల ఆదర్శంగా నడుస్తోందన్నారు. గుర్తింపు లేని స్కూళ్లపై సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు అవసరమన్న సీఎం ప్రతిపక్ష సభ్యులు రాజకీయాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కూడా సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. మార్చి, ఏప్రిల్ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రిస్తాం : కడియం
అంతకు ముందు ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీపై పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి సభ్యుడు సండ్రవెంకట వీరయ్య తదితరులు ప్రైవేట్ ఫీ దోపిడీని అరికట్టేందుకు చట్టం తేవాలన్నారు. పేద,మధ్యతరగతి ప్రజలు ఫీజులు కట్టలేక నానా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అయితే ఫీజలు సమస్యలపై విపక్షాల ఆవేదనతో ఏకీభవిస్తున్నామని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని 12 ఇంటర్నేషనల్ పాఠశాలలకు నోటీసులు పంపామని తెలిపారు. త్వరలోనే పేరెంట్స్ కమిటీ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణపై చర్చిస్తామని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. గుర్తింపు లేని పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 400 పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి.. ఒక యాజమాన్యం కింద ఒకే పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ ఒకే ఫీజు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల ఫీజు దోపిడీని నియంత్రించాలని కోరారు. ఒక యాజమాన్యం కింద వందల పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి.. ఒక యాజమాన్యం కింద ఒకే పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ ఒకే ఫీజు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కడియం అన్నారు. విద్యాహక్కు చట్టం ద్వారా కనీసం 25శాతం మంది పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే అవకాశం వస్తుందన్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, దీనిపై నియంత్రణ కమిటీ వేసినట్లు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, త్వరలో తల్లిదండ్రుల అసోసియేషన్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు. అయినా రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలోనే కామన్ రేట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని ఉద్ఘాటించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఫీజుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులెవ్వరూ ఆందోళన చెందొద్దని కోరారు.




