విద్యుత్‌ కష్టాలు మరింత తీవ్రం అధికారికంగా విద్యుత్‌ కోతలకు శ్రీకారం

హైదరాబాద్‌, జూలై 12 (: రాష్ట్రంలో గురువారం నుంచి అధికారిక విద్యుత్‌ కోతల వేళలు పెరిగాయి. విద్యుత్‌ సౌధ వద్ద ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు విద్యుత్‌ కోతలపై సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. మరింత సమయం విద్యుత్‌ కోతలు విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో గురువారం నుంచి కొత్త వేళలు అమలులోకి వచ్చాయి. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై నగరాల్లో మూడు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు12 గంటల పాటు విద్యుత్‌ కోతలు విధిస్తారు. భారీ పరిశ్రమలకు మూడు రోజులు, చిన్న తరహా పరిశ్రమలకు రెండు రోజుల పవర్‌ హాలీడే విధించారు. సవరించిన విద్యుత్‌ కోతల వేళలను రోజులో రెండు విడతల్లో అమలు చేస్తారు. అనధికార విద్యుత్‌ కోతలు ప్రత్యేకించి గ్రామాల్లో ఎలా ఉంటాయనేది ఎవరైనా ఇట్టే ఊహించగలరు. అయితే వ్యవసాయ రంగానికి ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం కోసం పారిశ్రామిక, గృహ వినియోగ రంగాలు త్యాగం చేయాల్సి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. ఏపీ ట్రాన్స్‌కో ప్రతి రోజూ 25 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేస్తుంది. కాని రోజుకు విద్యుత్‌ కొరత 40 మిలియన్‌ యూనిట్లకు పైగా ఉంది. ప్రతి రోజూ 255 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు గిరాకీ ఉంది. కానీ నానాటికీ విద్యుత్‌ కోసం పెరిగిపోతున్న గిరాకీని ట్రాన్స్‌కో అధిగమించలేకపోతున్నది. సహజవాయువు, బొగ్గు లాంటి ఇంధన సరఫరాలో తీవ్రమైన ఎద్దడి, జలాశయాల్లో పడిపోయిన నీటి మట్టం ఏపీ ట్రాన్స్‌కో ఇక్కట్లను రెట్టింపు చేశాయి. విద్యుత్‌ కోతల వేళలు అన్ని నగరాలు, పట్టణాలు గ్రామాలలో ఒకే విధంగా ఉంటాయి. గురువారం నుంచి అవి అమల్లోకి వచ్చాయి. అయితే విద్యుత్‌ కోతలు శాశ్వతం కాదని, జూలై మాసాంతానికి మంచి రుతుపవనాలతో పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ హీరాలాల్‌ సమారియా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్టణం, వరంగల్‌లో మూడు గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తారు. జిల్లా ప్రధాన కేంద్రాలు, కార్పొరేషన్లలో 5 గంటలు, పట్టణాలు, మునిసిపాలిటీలలో ఆరు గంటలు, మండల ప్రధాన కేంద్రాల్లో ఆరు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాతో పాటు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా లైటింగ్‌ సరఫరా ఉంటుంది. పెద్ద పరిశ్రమలకు వారంలో మూడు రోజుల పవర్‌ హాలిడే ఉంటుంది.
ఇదిలా ఉండగా జిల్లాలో విద్యుత్‌ కష్టాలు తీవ్రంగా పెరిగాయి. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ కోతలను భారీగా ట్రాన్స్‌కో అధికారులు పెంచటంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో ఎప్పుడు విద్యుత్‌ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు ఒంగోలు నగరంలో మూడు గంటల పాటు మాత్రమే విద్యుత్‌ కోతలను అమలు చేస్తుండా గురువారం నుంచి నాలుగు గంటలకు పెంచారు. పరిశ్రమలకు ఆదివారం నుంచి వారానికి రెండు రోజుల పాటు విద్యుత్‌ కోతలను విధించనున్నారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి రెండు విడతలుగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఉదయం వేళ ఐదు గంటలు, రాత్రి వేళ రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయనున్నట్టు అధికారవర్గాల ద్వారా సమాచారం. దీంతో జిల్లాలోని రైతులు విద్యుత్‌ సరఫరా కోసంరాత్రి వేళల్లో పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈపాటికే పశ్చిమ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయి పండ్లతోలు ఎండుముఖం పట్టాయి. రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ భారీ వర్షాలు కురవకపోవటంతో అన్ని వర్గాలప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా విద్యుత్‌ కోతలతో నగరంలోని ప్రజలతోపాటు ఉద్యోగులు కూడా కొవ్వొత్తుల వెలుగుల మధ్య ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోనికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలను ఎత్తివేయాంటూ ట్రాన్స్‌కో కార్యాలయాల వద్ద ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పామూరు, తాళ్లూరు, ఉలవపాడు మండలాల్లోని ప్రజలు ఆందోళన బాటపట్టారు. ప్రధానంగా పరిశ్రమలకు కోత విధిస్తే పారిశ్రామిక ప్రగతి కుంటుపడే అవకాశం ఉంది. దీంతో పరిశ్రమల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికార కోతలతో పాటు అనధికార కోతలు తీవ్రం కానున్నాయి. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌పేరుతో జిల్లాలోని ట్రాన్స్‌కో అధికారులకు తెలియకుండానే హైదరాబాద్‌లోనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో అధికార కోతలతో పాటు, అనధికార కోతలు భారీగా పెరిగిపోయాయి.