విద్యుత్‌ భారంపై గళమెత్తిన కామ్రేడ్లు

అరెస్టులు.. విడుదల
హైదరాబాద్‌, జూలై25 (జనంసాక్షి) :రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సర్‌చార్జీలు పెంచినందుకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సిపిఐ, సిపిఎంతో పాటు 8 వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు బుధవారం చలో సచివాలయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందస్తు చర్యగా పోలీసులు భారీ ఎత్తున భద్రతాచర్యలు చేపట్టారు. గతంలో వామపక్షాలు నిర్వహించిన బషీరాబాగ్‌ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. దీంతో సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించి ఎక్కడికక్కడ పోలీసులు భారీ కేడళ్లను ఏర్పాటు చేశారు. అయినా వామపక్ష పార్టీల నేతలు గ్రూపులుగ్రూపులుగా విడిపోయి, తరలివచ్చి సచివాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. వీరిని మధ్యలోనే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను తెలుగుతల్లి విగ్రహం వద్ద, సిపిఎం నేత రాఘవులు, మధులను పోలీసులు మధ్యలోనే అడ్డుకొని వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొందరు నేతలను, కార్యకర్తలను గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టులను నిరసిస్తూ కార్యకర్తలు ఎదురు తిరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వామపక్ష పార్టీల కార్యకర్తలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.