విద్యుదాఘాతంతో బాలుడు మృతి

– పీబీఈఎల్‌ గేటెడ్‌ సొసైటీలో విషాధ ఘటన
హైదరాబాద్‌, ఫిబ్రవరి12 (జ‌నంసాక్షి) ఆడుకుంటూ విద్యుత్‌ స్తంభాన్ని తాకిన బాలుడు.. విద్యుదాఘాతంతో  ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నగరంలో నార్సింగి సవిూపంలో పీబీఈఎల్‌ గేటెడ్‌ సోసైటీలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సోసైటీలో అపార్ట్‌ మెంట్‌లో ఉంటున్న బాలుడు ఆడుకుంటూ ల్యాంప్‌ పోస్ట్‌ను పట్టుకోవడంతో అండర్‌ గ్రౌండ్‌ వైర్లు తాకి షాక్‌కు గురయ్యాడు. అయితే బాలుడు విద్యుత్‌ షాక్‌ కు గురైన సమయంలో చుట్టూ జనాలున్నా ఎవరూ గమనించలేదు. దీంతో స్తంభానికి అతుక్కొని కొద్ది క్షణాలకే బాలుడు కుప్పకూలిపోయాడు.. దీంతో చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేలోపే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్‌ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలుడి తండ్రి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని వారు చెన్నైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. బాలుడిని మృతదేహాన్ని కూడా అక్కడికి తరలించినట్లు సమాచారం. అయితే కనీసం బయట వ్యక్తులను కూడా అనుమతించని పీబీఈఎల్‌ భద్రతా సిబ్బంది.. బాలుడి పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక  ఈ పెబెల్‌ సిటీలో సుమారు 1300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఘటనతో ఈ నివాస సముదాయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.