*”విద్య గురించి మీకేం తెలుసు”..!*
– *విద్యా కమిటీని అవమానించిన ప్రధానోపాధ్యాయుడు*
– *కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జగ్యాతండా కమిటీ చైర్మన్*
*”అసలు విద్య గురించి మీకేం తెలుసు.. మాకు తోచినట్లు మేం బోధిస్తాం.. మీ పిల్లల్ని ఇష్టమైతే పంపించండి.. లేకుంటే లేదు.. మా పనులు మాకున్నాయి.. మీకు ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండి..!” జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో, నూతన కలెక్టరేట్ నిర్మాణం జరిగిన గ్రామంలో ఒక ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు విద్యా కమిటీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. రఘునాధపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామం జగ్యాతండాలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై ఆ స్కూల్ విద్యా కమిటీ సభ్యులు సోమవారం చైర్మన్ బానోతు రమేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు సాక్షాతూ విద్యా కమిటీ మీటింగ్ లో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించాడని, అవహేళనగా మాట్లాడారని వివరించారు. జగ్యాతండా పాఠశాలలో 50 మంది నిరుపేద గిరిజన విద్యార్థులు చదువుతున్నారని, అయినా అక్కడ ప్రధానోపాధ్యాయుడితో పాటు పనిచేసే మరో టీచర్ ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని తెలిపారు. 27వ తేదీన జరిగిన విద్యా కమిటీ సమావేశంలో మేము సమస్యలపై చర్చిస్తే “విద్య గురించి మీకేం తెలుసు” అంటూ అవహేళన చేశారని ఆరోపించారు. హెచ్.ఎం ప్రతిరోజు స్కూల్ కి ఆలస్యంగా వస్తారని, అదేమని ప్రశ్నిస్తే మాకు సవాలక్ష పనులు ఉంటాయని దురుసుగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. దీంతో 50 మంది పిల్లలకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఓకే టీచర్ పాఠాలు చెబుతున్నారని వివరించారు. కనీస విద్యా ప్రమాణాలు పాటించడం లేదని, మధ్యాహ్న భోజనంలో ఏమాత్రం నాణ్యత పాటించడం లేదని విమర్శించారు. ఫలితంగా పిల్లలకు కనీసం రాయడం, చదవడం కూడా రావడం లేదని చెప్పారు. ఈ విషయాలపై ఎంఈవో కు ఫోన్ చేసి ఫిర్యాదు చేద్దామని ఫోన్ చేస్తే ఆయన పొరపాటున కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. విద్యా ప్రమాణాలు పాటించకుండా, విద్యా కమిటీపై కనీస గౌరవం లేకుండా, పిల్లల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుని తమ పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.*