విధులు నిర్వహించే చోటనే వీఆర్‌ఓల నివాసం
. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ఉండనిపై చర్యలు
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు విధులు నిర్వహించే చోటనే నివాసం ఉండాలని వీఆర్‌ఓలను ఆదేశించింది. గ్రామాలు, మండలాల్లోని సమస్యలు వెంటవెంటనే పరిష్కారం అయ్యేలా చూడాల్సిన వీఆర్‌ఓలు.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరింది. నియమ నిబంధనలను పాటించని వీఆర్‌ఓలపై కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి నుంచి గ్రామాల్లో నివాసం ఉండని వీఆర్‌ఓలను సస్పెండ్ చేయాలని చీఫ్ కమిషనర్ లాండ్ అడ్మినిస్ట్రేషన్.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వారంలో ఒక రోజు మాత్రమే మండలాలకు వెళ్లాలని.. మిగతా పని దినాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
రెవెన్యూ శాఖ పరిధిలో విధులు నిర్వర్తించే వీఆర్‌ఓలకు.. ప్రభుత్వం నాలుగైదు గ్రామాల బాధ్యతలను అప్పగించింది. గ్రామీణ, మండల ప్రాంతాల్లోని సమస్యల సత్వర పరిష్కారంతో పాటు ప్రజా సమస్యలు తీర్చడంలో వీఆర్‌ఓలది కీలకపాత్ర. దాంతో ప్రభుత్వం వీఆర్‌ఓలను వారికి నిర్దేశించిన ఏదేని ఒక గ్రామంలో నివాసం ఖచ్చితంగా ఉండాలనే నిబంధన విధించింది. ఒక్కో గ్రామంలో ఒక్కో రోజు అందుబాటులో ఉండి.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించింది. ప్రతి గ్రామంలో ఉండే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి వీఆర్‌ఓలు విధులు నిర్వర్తించాలని సీసీఎల్‌ఏ ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పని చేసే.. ఆరు వేల మంది వీఆర్‌ఓలకు ఇవే నిబంధనలను అమలవుతాయి. గ్రామాల్లోనే ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని గతంలో హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందని సీసీఎల్‌ఏ తెలిపింది. ప్రభుత్వం, హై కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని సీసీఎల్‌ఏ.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.