విధుల్లో చేరుతాం.. సమ్మె విరమిస్తాం.. – విధుల్లో చేరడానికి వీల్లేదు..

– లేబర్‌కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకముంది

– సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం

– ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి

విధుల్లో చేరడానికి వీల్లేదు..

– అంతా మీ ఇష్టమేనా..!

– జేఏసీ ప్రకటన హాస్యాస్పదం

– లేబరు కోర్టులో తేలాక, హైకోర్టు తీర్పు వెలువడ్డాకే.. తుది నిర్ణయం

– మీ సమ్మె చట్టవిరుద్ధం

– సర్కారు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌,నవంబర్‌ 26(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. హైకోర్టులో ఊరట దక్కక పోవడం, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మె విరమణ అనివార్యంగా మారింది. దీంతో మంగళవారం నుంచి కార్మికులందరూ డ్యూటీలకు హాజరుకావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఇదే విషయమై సోమవారం విూడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్యం నుంచి కనీసం స్పందన రాలేదని అన్నారు. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించిందన్నారు. ప్రభుత్వ నిర్బంధకాండ మధ్య నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అధికారులు కొంతమంది ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంద న్నారు. దానిని అడ్డుకోవాలన్నారు. సమ్మె విరమించినా నైతిక విజయం కార్మికులదేనని అన్నారు. కార్మికులు ఓడిపోలేదని, ప్రభుత్వ గెలవలేదని పేర్కొన్నారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం లేబర్‌ కోర్డుకు వెళ్లాల్సి ఉందన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మికులందరూ విధులకు హాజరవ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు. సెకండ్‌ షిప్ట్‌ వాళ్లు కూడా విధులకు రావాలన్నారు. ఇన్ని రోజులు బస్సులు నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటి నుంచి డ్యూటీలకు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెను విరమిస్తున్నామన్న ఆయన.. ప్రైవేట్‌ కార్మికులు విధుల నుంచి వెళ్లిపోవాలని కోరారు. ప్రభుత్వం బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం.. అలా కాని పక్షంలో మళ్ళీ తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. సమ్మె కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందుకు చింతిస్తున్నామని అన్నారు.కేవలం ఆర్టీసీని కాపాడుకోవడం కోసమే కోర్టు విూద నమ్మకం ఉంచి.. సమ్మెను విరమిస్తున్నామన్నారు. అయితే గవర్నర్‌ తమిళసైతో భేటీ అయిన కేసీఆర్‌.. ఆర్టీసీ సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే 52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. తమ సమ్మెపై ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. మంగళవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. అయితే కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తుందా? సమ్మె విరమించిన కార్మికులను ఆర్టీసీ విధుల్లోకి తీసుకుంటుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. గతంలో ఇకపై సమ్మె చెయ్యబోమనే రాతపూర్వక హావిూతో కార్మికులందరూ విధులకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండుసార్లు ఆఫర్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆఫర్‌ను నేతలు, కార్మికులు బేఖాతరు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను కాదని, ఇప్పుడు విధులకు హాజరవుతామంటే ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమే. కొద్దిరోజుల క్రితమే కార్మికులను ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధులకు హాజరయ్యేందుకు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల వద్ద బారులు తీరారు. అయితే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలు తమకు రాలేదని డిపో మేనేజర్లు కార్మికులను తేల్చి చెప్పారు. దీంతో చేసేదేం లేక మళ్లీ సమ్మె బాట పట్టారు.

 

విధుల్లో చేరడానికి వీల్లేదు..

 

సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతల ప్రకటన హాస్యాస్పదమని ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ అన్నారు. ఇష్టమొచ్చినపుడు గైర్హాజరై.. ఇప్పుడు చేరతామంటే కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం చేస్తామంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సాధ్యంకాదని చెప్పారు. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సునీల్‌శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సునీల్‌శర్మ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకటన వెలువడటం గమనార్హం.

అప్పటి వరకు సంయమనం పాటించాలి

”రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే.. మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. తమకు ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఉండదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. అంతేకానీ.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సమ్మె చేయమని చెప్పలేదు. బతుకమ్మ, దసరా, దీపావళిలాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారు. కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై మళ్లీ ఇష్టానుసారం విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మికశాఖ కమిషనర్‌ తగు నిర్ణయం తీసుకుంటారు. దానిని అనుసరించి ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుంది. అంతా చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం జరుగుతుంది. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.

తాత్కాలిక కార్మికులను అడ్డుకుంటే చర్యలు తప్పవ్‌

”హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దు. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరుతున్నాను. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సవిూక్షించడం జరుగుతుంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదు. చట్టపరంగా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా తెలియజేస్తాం. హైకోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారం కార్మికశాఖ కమిషనర్‌ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని కోరుతున్నా” అని సునీల్‌శర్మ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

తాజావార్తలు