వినాయక నిమజ్జన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

వినాయక ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనం ఊరేగింపులకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్ల నుంచి నిమజ్జనం రోడ్‌ మ్యాప్‌ను పోలీసులు ఖరారు చేసినట్లు వెల్లడించారు సీపీ మహేందర్‌రెడ్డి. గణేష్‌ నిమజ్జనాన్ని ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని.. ఎలాంటి ఘటనలకు తావు లేకుండా సెలబ్రేట్‌ చేసుకోవాలని కోరారు సీపీ మహేందర్‌రెడ్డి. సమస్యాత్మక ప్రాంతాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని స్పష్టం చేసారు. నిమజ్జనానికి నగర వ్యాప్తంగా 25 వేల మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు, ఏడోరోజు, పదో రోజుల్లో  చేసే గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్  డైవర్షన్ చేశామని ట్రాఫిక్ డీసీపీ చౌహన్ తెలిపారు. సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ, ట్రాఫిక్‌ను పలు కూడళ్లలో మళ్లిస్తున్నామని, నిమజ్జన వేడుకలను నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని డీసీపీ చౌహన్ స్పష్టం చేసారు. గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని.. రూట్ డైవర్షన్లతో ఎక్కడా ట్రాఫిక్‌ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేసారు.

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు పకడ్భందీగా నిర్వహిస్తామని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. నిమజ్జన ఉత్సవాలకు వినాయకులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున, ఆయా శాఖల అధికారుల తో కలిసి  సమన్వయంతో పోలీసులు పని చేస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని.. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ట్యాంక్‌బండ్ దగ్గర కూడా పక్క ప్లానింగ్ తో  పని చేస్తామని… నిమజ్జనం ఆలస్యం కాకుండా చూస్తామని స్పష్టం చేసారు.

నగరవ్యాప్తంగా ప్రతి 4 కిలోమీటర్లకు ఒక యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు పోలీసులు. మహిళల భద్రతకు సైతం 100 షీ టీమ్స్‌ను అందుబాటులో ఉంచినట్లు  పోలీసులు తెలిపారు.