విపక్షాల దిమ్మదిరిగేలా ఇందూరు సభ
అపవిత్ర కూటమికి ఓటమి తప్పదు
కెసిఆర్ సభకు భారీగా ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో 9స్థానాలు గులాబీకే: బీగాల
నిజామాబాద్,అక్టోబర్2(జనంసాక్షి): తెలంగాణలో ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి మోకాలడ్డుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్ విమర్శించారు. నిజామాబాద్ సభతో సిఎం కెసిఆర్ వారి విమర్శలకు ఘాటుగానే స్పందిస్తారని అన్నారు. రాజకీయ అవరాల కోసం పార్టీలు కూటమి కట్టి ప్రజలను గందర గోళంలో పడేయాలని చూస్తున్నారని అన్నారు. ఒంటరిగా వెళ్తే డిపాజిట్లు దక్కవనే భయంతో కాంగ్రెస్ పార్టీ కూటమి కడుతున్నదని, తెలంగాణ వ్యతిరేకంగా ఏ పార్టీ అయితే పనిచేసిందో అదే పార్టీతో కూటమి కట్టడమంటే తెలంగాణను అభివృద్ధికి దూరం చేయడమేనని విమర్శించారు. మహా కూటమికి ఓటమి అని విమర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ఆశీర్వాద సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని, సభికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారన్నారు. తొమ్మిది నియోజకవర్గాల నుంచి వేలాదిగా ప్రజలను తరలిస్తామని, ప్రజా ఆశీర్వాద సభకు తరలి వచ్చేందుకు ప్రజలంతా ఉత్సాహం గా ఉన్నారని, అనుకున్న దానికంటే ప్రజలు పెద్ద మొత్తంలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజా ఆశీర్వాద సభతో రాష్ట్రంలో విజయ ఢంకా మొగిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు తప్పులను ఎత్తిచూపాలి కాని దురదృష్టవశాత్తు ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పాటుపడు తుంటే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి పైశాచికానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం లో ప్రజా తీర్పే శిరోధార్యమని, తెలంగాణలో ప్రగతి రథచక్రాలు ఆగకూడదని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో తొమ్మిందిటిని కైవసం చేసుకోవడంతో పాటు రెండు ఎంపీ స్థానాలు కూడా గెలుచుకున్నామని తెలిపారు. మళ్లీ అదే ఒరవడితో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని బీగాల ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విపక్షాల దిమ్మతిరిగేలా జనం వచ్చి కెసిఆర్‌ను ఆశీర్వదిస్తారని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచార సరళి జిల్ల్‌ఆలో జోరుగా సాగుతోందని అన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఊహించని మద్దతు లభిస్తున్నదన్నారు. గ్రామాలకు గ్రామాలు, కూల సంఘాలు ఏకగ్రీవ నిర్ణయాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారని, దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఉన్న అచంచలమైన విశ్వాసమేనని అన్నారు. ప్రజాభిమానంతో తిరిగి ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంటామని అన్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.