విప్లవాత్మక జిఎస్టీపై పునరాలోచన ఏదీ ?


ఈ భారాలపై ఎక్కడ మొర పెట్టుకోవాలి
ఇన్సూరెన్స్‌లపై జిఎస్టీ విధించడం ఎంతకాలం
మధ్యతరగతి ప్రజలకు భారంగా సొంతింటి కల
న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): భారత్‌ లాంటి దేశాల్లో పన్నులు సరళీకృతంగా ఉండాలి. ఒకే పన్ను విధానం అంటూ జిఎస్టీని తీసుకుని వచ్చినా పన్నుల భారాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించడం లేదు. ప్రతి
పనికి జిఎస్టీని విధించడం దారుణం కాక మరోటి కాదు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బీమా మొత్తాలపై జిఎస్టీ విధించడం దారుణం కాక మరోటి కాదు. దీనిపై ఇటీవల పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చినా ఆర్థికమంత్రి చెప్పిన సమాధానం ప్రజలను అవమానించేదిగా ఉంది. దీనిని ప్రస్తావించిన కేంద్రమంత్రి నితిని గడ్కరీని కూడా నిర్మలా సీతరామన్‌ అవమానించారు. ఒక్కరు ప్రస్తావించిన అంశాన్ని 200మంది పట్టుకుని సాగదీసారని తన తలబిరుసు సమాధానంతో చెప్పారు. పెట్రో ధరలపై జిఎస్టీ విధించడం లేదు. గ్యాస్‌ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. ప్రజలు కడుతున్న పన్నులతో పాలకులు రాజ్యాలు ఏలుతున్నారు. తమ సుఖాలకు ఖర్చు చేస్తున్నారు. పథకాల పేరుతో వంచన చేస్తున్నారు. నిజానికి జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి పరిమితం చేయాలి. పన్నుల పేరుతో ఎలా బాదుతున్నారో చర్చించాలి. ఇల్లు కొనాలంటే రకరకాలు పన్నుల రూపంలో బాదేస్తున్నారు. రిజస్టేష్రన్లకు రాష్టాల్రు లక్షల్లో వసూలు చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇలా రకరకాల పన్నులపై చర్చించాలి. అవసరమైతే పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చించే ధైర్యం చేయాలి. బ్యాంకుల రుణ వితరణలో
లక్ష కోట్ల రూపాయల తరుగుదల కనిపించిందని గతేడాది రిజర్వుబ్యాంకు వెల్లడిరచడం గమనిస్తే, గిరాకీ మందగించడం వల్లనే కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను పెట్టడానికి రుణాలు తీసుకునేవారు కరవవుతు న్నారని స్పష్టమవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తరచూ మాంద్యానికి గురవుతూనే ఉంటుంది. అది సహజ పరిణామం కూడా. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాలు ఒక సరళ సూత్రాన్ని పాటించి విజయం సాధించాయి. భారత్‌ కూడా అలాంటి ఉద్దీపన విధానాన్ని చేపట్టాలి. కొన్ని రంగాలు తమ సామర్థ్యం మేరకు ఉత్పత్తి సాగించలేక పోయాయి. ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచితే ఆర్థిక వ్యవస్థలోకి ధన ప్రవాహం, దానితోపాటే గిరాకీ పెరిగి, పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా వినియోగించుకుంటాయి. దీనికి ఉద్దీపనలు ఇవ్వాలే తప్ప కొందరు కార్పోరేట్లకు రుణాలను మాఫీచేయడం, ఎగవేతదారుల రుణాలను మాఫీ చేయడం దేశ అభివృద్ది కాదు. అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం ఎప్పటికీ బలహీనంగానే ఉంటున్నాం. బలహీన దేశాలైన సూడాన్‌ లాంటి దేశాల్లో మాత్రమే మనం బలవంతులం. 78ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ వెనక్కి తిరిగి చూస్తే మన ఆర్థిక ప్రగతి బలపడిరదా లేక బలహీన పడిరదా అన్నది రూపాయిని అడిగితే చెబుతుంది. ప్రధానంగా మనం రూపాయిని డాలర్‌తో పోలిస్తేనే మన బలం గురించి తెలుస్తుంది. డాలర్‌ మనకు అందనంతగా ఎదిగి పోతోంది. ఇది డాలర్‌ బలమో లేక మన రూపాయి బలహీనతో కానీ పాలకులు మాత్రం ఘనంగా అభివృద్ది గురించి ఢంకా బజాయిస్తున్నారు. అంతెందుకు నోట్ల రద్దు జరగక ముందు ఉన్న 500 రూపాయల విలువ ఇప్పుడు పది వంద నోటుకు లేదంటే నమ్మగలమా? కానీ నమ్మాలి. ఆనాటి 500 నోటు ఇవాళ్టి వంద నోటు ఒకటే అన్న సంగతి బజారులో అడుగుపెడితే సామాన్యుడే చెబుతాడు. ప్రతి భారతీయుడికి ఇల్లు, విద్యుత్తు, గ్యాస్‌, నీరు, మరుగుదొడ్డి, నైపుణ్యాభి వృద్ధి, వైద్యం, బీమా వంటి సౌకర్యాలు అందాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం కాదు చేసి చూపాలి. అప్పుడే దేశం పురోగమిస్తుంది. అందుకు క్షేత్రస్థాయిలో చర్చించాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి.