విప్లవ కవి పోతరాజు కన్నుమూత

z39k59wcహుజూరాబాద్/ఎల్కతుర్తి/కరీంనగర్:  విప్లవకవి తాడిగిరి పోతరాజు(78) శుక్రవారం  అనారోగ్యంతో కరీంనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అత్తిలి మండలం తాగికొడకు చెందిన రైతు కుటుంబంలో 1937లో తాడిగిరి పోతరాజు జన్మించారు.

తండ్రి రాయపరాజుతోపాటే 1950 ప్రాంతంలో కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ అనుబంధ గ్రామం శాంతినగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఆయన కరీంనగర్‌లో మల్టీపర్పస్ లెక్చరర్‌గా బేసిక్ ట్రైనింగ్‌స్కూల్‌లో విధులు నిర్వహించారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా, వరంగల్ జిల్లా సంగెంలోని కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి 1995లో ఉద్యోగ విరమణ పొందారు. ఆర్‌ఈసీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయనకు భార్య కాత్యాయని, కుమారుడు రుద్రరాజు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

అభ్యుదయ రచయితగా పేరు..

శ్రీశ్రీ కవితలపై ఆకర్షితుడైన పోతరాజు.. కాళోజీ వద్ద శిష్యునిగా చేరి రచనలు చేయడం ప్రారంభించారు. 1958లో భారతి అనే పత్రిక మొదటిగా పోతరాజు రాసిన ‘గృహోన్ముఖి’ అనే కథను ప్రచురించింది. అనంతరం ‘పావురం’ నవలతో పోతరాజు రచయితగా ప్రస్థానం ప్రారంభించారు. మట్టిబొమ్మలు,  గాజుకిటికీ, చివరిఅంచు, చితినెగళ్లు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమ మాసపత్రిక విద్యుల్లతలో ‘నా ఎర్రబుట్ట’ కథ కారణంగా పత్రికపై కేసు పెట్టి మూసివేయించగా.. పోతరాజుపై కేసు నమోదు చేశారు.

ఆయన వరంగల్ సెంట్రల్ జైల్లో ఎనిమిది నెలలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పోతరాజును బర్తరఫ్ చేశారు. న్యాయస్థానం ద్వారా తిరిగి ఉద్యోగాన్ని సాధించారు. ఆయన కథలు పలు భాషల్లో అనువాదమయ్యాయి. విరసం సభ్యుడిగా, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో, ప్రజా ఉద్యమాల్లో పేరుగాంచిన పలువురు పోతరాజు వద్ద అక్షరాలు దిద్దినవారే. కాగా, పోతరాజు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుమారుడు రుద్రరాజు తెలిపారు.